అక్టోబర్ 31వ తేదీన ‘బాహుబలి: ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్లో అవుతున్నాయి.
అయితే ఈ ట్రెండ్‌ను బట్టి పరిశీలిస్తే రెండు విషయాలు అవగతం అవుతున్నాయి. అందులో ఒకటి, రీ-రిలీజ్ సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేసేంత ఖాళీగా జనాలు ఉన్నారా అనేది ఒకటైతే, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా లేని క్రేజ్ ఈ సినిమాకి ఉందనేది మరొకటి.
వాస్తవానికి రాజమౌళి మేకింగ్‌పై అందరికీ నమ్మకం ఉంది. ఇప్పటికే బాహుబలి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ కూడా అంతకుమించి హిట్ అయింది. ఈ రెండు సినిమాలను కలిపి, కొన్ని పాత డిలీటెడ్ సీన్స్‌ను యాడ్ చేసి, కొంత నిడివి తగ్గించి, మూడు గంటల 45 నిమిషాల నిడివితో సినిమా రిలీజ్ చేస్తున్నారంటే దాదాపుగా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్‌ను బట్టి టికెట్లు బుక్ చేసుకుని వెళుతున్నారా అంటే, అదీ లేదు.
ముందుగానే రీ-రిలీజ్ సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక రీ-రిలీజ్ సినిమాకి ప్రీమియర్స్ వేయడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రీమియర్స్ టికెట్లు కూడా హాట్ కేక్స్లా అమ్ముడు పోవడం మరో ఎత్తు.
ఇక్కడ రాజమౌళి స్టామినా బయటపడుతోంది. అదేవిధంగా జనాలు ఎంత ఖాళీగా ఉన్నారో కూడా అర్థమవుతోంది. అంతేకాక, కంటెంట్ బావుంది అనుకుంటే, చూసిన సినిమాని మళ్లీ మళ్లీ చూడడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదనేది స్పష్టం అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఫిల్మ్ మేకర్స్ కూడా కంటెంట్ మీద ఫోకస్ పెడితే మంచిదేమో అనిపిస్తుంది.
































