ఈ మార్పు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ ఇటీవల అధికారిక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే, అడ్మిషన్ తీసుకునే సంవత్సరంలో మార్చి 31 నాటికి విద్యార్థికి తప్పనిసరిగా ఆరు సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
దశాబ్దాలుగా ఢిల్లీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఐదేళ్ల చిన్న పిల్లలను కూడా చేర్చుకునేవారు. దీనివల్ల విద్యార్థుల్లో నేర్చుకునే సామర్థ్యం (Cognitive and Emotional Readiness)లో వ్యత్యాసం ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి, కొత్త నిబంధనల ప్రకారం పునాది స్థాయి (Foundational Learning)లో వయోపరిమితి ఈ క్రింది విధంగా ఉండనుంది.
నర్సరీ (బాల్వాటిక 1) : 3 – 4 సంవత్సరాలు
లోయర్ కేజీ (బాల్వాటిక 2) : 4 – 5 సంవత్సరాలు
అప్పర్ కేజీ (బాల్వాటిక 3) : 5 – 6 సంవత్సరాలు
ఒకటో తరగతి (Class 1) : 6 – 7 సంవత్సరాలు
వయో సడలింపు: విద్యా శాఖ నిబంధనల ప్రకారం, నిర్దేశించిన కటాఫ్ వయస్సులో ఒక నెల వరకు అటు ఇటుగా సడలింపుకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఈ నూతన వ్యవస్థను దశలవారీగా అమలు చేయనున్నారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి లోయర్ కేజీ (బాల్వాటిక 2), అప్పర్ కేజీ (బాల్వాటిక 3) తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నారు. 2026-27 సెషన్‌కు ముందు ఇప్పటికే బడిలో చేరిన విద్యార్థులకు ఈ మార్పు వర్తించదు.
ఎడ్యుకేషన్ పాలసీ నిపుణులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆరేళ్లు నిండక ముందే ఒకటో తరగతిలోకి పంపడం వల్ల పిల్లల సైకో-సోషల్ మరియు మోటార్ స్కిల్స్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకముందే వారిపై అకడమిక్ ఒత్తిడి పడుతుందని నిపుణులు వాదిస్తున్నారు.
ఈ ఏకరూప వయస్సు నిర్మాణం ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో ‘కాగ్నిటివ్ అలైన్‌మెంట్’ (అభ్యాస సామర్థ్యం) మరియు ‘పెడగాగిక్ కన్సిస్టెన్సీ’ (బోధనా పద్ధతుల్లో స్థిరత్వం) ఉండేలా చూస్తుందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేట్ పాఠశాలలు చాలా వరకు ఆరు సంవత్సరాల నిబంధనను పాటిస్తుండగా, తాజా సర్క్యులర్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే నిబంధన అమల్లోకి రానుంది.
































