కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు శుభవార్త వినిపించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం జరిపింది.
దీంతో పాటు 8వ పే కమిషన్ పని ప్రారంభమయ్యేలా అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా చైర్ పర్సన్ ను 8వ పే కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. ఈ నూతన పే రివిజన్ కమిషన్ సంఘానికి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ చైర్ పర్సన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర సభ్యుల విషయానికి వస్తే మరో సభ్యుడిగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ ను నియమించారు. ఆయన ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే మెంబర్-సెక్రటరీగా పంకజ్ జైన్ నియమించారు. ఆయన కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
అయితే ఎనిమిదవ పే కమిషన్ పనితీరు ప్రారంభమైన నేపథ్యంలో రాబోయే రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఎనిమిదో పే కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగులు 8వ పే కమిషన్ ముందు తమ డిమాండ్లను ముందు ఉంచుతున్నారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి లేదా పెన్షనర్ వేతనం లేదా పింఛను పెరుగుదలను సూచిస్తుంది. 8వ పే కమిషన్ సిఫార్సు చేసే ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను బట్టి కనీస వేతనం పెంపుదల అనేది ఉంటుంది.
ఏడవ పే కమిషన్ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.52 గా ప్రకటించింది. దీంతో అప్పుడు కనీస వేతనం రూ. 7000 నుంచి రూ. 18,000 లకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గతంలో కన్నా కూడా ఎక్కువ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఉద్యోగుల ఐక్య సంఘటన కార్యాచరణ సమితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందు తమ డిమాండ్ ను ముందు పెట్టింది. కాగా ఇప్పుడు కమిషన్ ముందు కూడా తమ డిమాండ్లను ముందు పెట్టే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గతంలో కన్నా ఎక్కువ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ కనుక 8వ పే కమిషన్ ఆమోదించినట్లయితే, కనీస వేతనం భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదాహరణకు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఆమోదించినట్లయితే లెవల్ 1 ఉద్యోగికి కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 51,480 వరకూ పెరిగే అవకాశం ఉంది. ఇక Level AGP 15 HAG గ్రేడ్ ఉద్యోగులకు రూ. 2,24,100 కనీస వేతనం నుంచి రూ. 6,40,926 వరకూ పెరిగే అవకాశం ఉందని 8th CPC కాలిక్యులేటర్ ఆధారంగా తెలుసుకునే అవకాశం ఉంది.
































