బైబై పెట్రోల్.. వచ్చేదంతా CNG యుగమే.. టీవీఎస్ జూపిటర్‌కు పోటీగా సుజుకీ యాక్సెస్

పెట్రోల్ ధరలతో విసిగిపోయిన వారికి గుడ్ న్యూస్. ఇకపై అంత బాధపడాల్సిన అవసరం లేదు. టూ వీలర్స్ ప్రపంచంలోకి సీఎన్దీ స్కూటర్ల యుగం అడుగుపెడుతోంది.


టీవీఎస్ కంపెనీ త్వరలోనే దేశంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ(CNG) స్కూటర్‌ను విడుదల చేయనుంది. సీఎన్‌జీ స్కూటర్‌ను లాంచ్ చేసేందుకు టీవీఎస్ కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటర్ మరేదో కాదు.. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, కంపెనీ అత్యధికంగా విక్రయించే స్కూటర్లలో ఒకటైన టీవీఎస్ జూపిటర్. ఆ స్కూటర్ సీఎన్జీ విభాగంలో రానుంది.

అయితే ఈ పోటీలో మేమైనా తక్కువా అంటూ సుజుకి కూడా తన అత్యంత ప్రజాదరణ పొందిన యాక్సిస్ మోడల్‌ను సీఎన్జీ వెర్షన్‌లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరి ఈ రెండు అత్యంత ప్రజాదరణ గల రెండు స్కూటర్ల మధ్య పోటీ ఎలా ఉండనుంది. ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చుతో సీఎన్జీ స్కూటర్లు ఇండియా మార్కెట్‌ను ఎలా షేక్ చేయబోతున్నాయో తెలుసుకుందాం.

పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత భారతీయ ద్విచక్ర వాహన వినియోగదారులను ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికల వైపు దృష్టి సారించేలా చేశాయి. ఈ నేపథ్యంలో CNG స్కూటర్లు ఒక ఆశాజనకమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ముందుకు వస్తున్నాయి. CNG స్కూటర్లు సాధారణంగా పెట్రోల్ స్కూటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందించడం, నిర్వహణ ఖర్చు (మెయింటెనెన్స్ కాస్ట్) తక్కువగా ఉండటం వంటి అంశాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ కొత్త మార్కెట్ యుగంలో అడుగు పెట్టేందుకు దేశంలోని రెండు దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థలైన టీవీఎస్, సుజుకి సిద్ధమవుతున్నాయి.

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ స్కూటర్‌గా టీవీఎస్ జూపిటర్ 125 CNG

టీవీఎస్ మోటార్ కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన జూపిటర్ 125 మోడల్‌కు CNG వెర్షన్‌ను తీసుకురావడానికి దాదాపుగా సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌గా గుర్తింపు పొందనుంది. 2026 మధ్య నాటికి ఇది భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టవచ్చని అంచనా. టీవీఎస్ జూపిటర్ 125 CNG.. ఒక కిలో CNGకి సుమారు 84 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్‌ను అందించగలదని భావిస్తున్నారు. ఈ మోడల్ సుమారు 1.4 లీటర్ల CNG ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది 2 లీటర్ల పెట్రోల్ రిజర్వ్ ట్యాంక్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ డ్యూయల్-ఫ్యూయల్ (CNG + పెట్రోల్) వ్యవస్థ CNG పంపులు అందుబాటులో లేని చోట్ల కూడా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ప్రయాణించే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ మోడల్ తన పవర్‌ఫుల్ 125cc ఇంజిన్‌తో పాటు, మెరుగైన మైలేజ్‌ను అందిస్తూ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

బరిలో సుజుకి యాక్సెస్ CNG.. భారీ ట్యాంక్ సామర్థ్యంతో పోటీ

టీవీఎస్ జూపిటర్ 125 సీఎన్‌జీ రాకకు ముందే, దానికి గట్టి పోటీనిచ్చేందుకు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి యాక్సెస్ CNG/CBG కాన్సెప్ట్ వెర్షన్‌ను ప్రదర్శించడం ఈ అంచనాలకు బలం చేకూర్చింది. సుజుకి యాక్సెస్ CNG మోడల్‌లో 6 లీటర్ల భారీ CNG ట్యాంక్ ఉండవచ్చని సమాచారం. ఇది టీవీఎస్ జూపిటర్ కంటే గణనీయంగా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం. అయితే, ఈ ట్యాంక్ సీటు కింద అమర్చబడి ఉండటం వల్ల డిక్కీలో సామాన్లు పెట్టుకోవడానికి స్థలం తగ్గే అవకాశం ఉంది. సుజుకి యాక్సెస్ కూడా ఒక కిలో CNGకి 80 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వగలదని భావిస్తున్నారు. దీనికి 2 లీటర్ల పెట్రోల్ రిజర్వ్ ట్యాంక్ కూడా ఉంటుంది.

మార్కెట్ ప్రభావం.. భవిష్యత్తు సవాళ్లు

సుజుకి యాక్సెస్ CNG మోడల్ గనుక ఇండియాలో విడుదల అయితే, అది టీవీఎస్ జూపిటర్ 125 CNGకి గట్టి పోటీనిస్తుందని అనడంలో సందేహం లేదు. సుజుకి యాక్సెస్ మోడల్ ఇప్పటికే పెట్రోల్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా ఉంది. CNG వెర్షన్ విజయవంతమైతే, సుజుకి యాక్సెస్ పెట్రోల్, ఎలక్ట్రిక్ (త్వరలో రాబోతోంది), CNG అనే మూడు వెర్షన్లలో అందుబాటులోకి వచ్చి, హోండా యాక్టివా వంటి ప్రత్యర్థులకు తీవ్ర సవాల్‌ను విసిరే అవకాశం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ CNG స్కూటర్లు రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో పెను మార్పులు తీసుకురావచ్చు. పెట్రోల్ ధరల భారం నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి, ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. అయితే ఈ స్కూటర్లకు భారీ డిమాండ్ ఏర్పడాలంటే, CNG రీఫిల్లింగ్ మౌలిక సదుపాయాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించాలి. సుజుకి తన యాక్సెస్ CNG మోడల్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాలి. అంతలోపు టీవీఎస్ జూపిటర్ 125 CNG మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.