రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ మారింది

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌ను రైల్వే శాఖ మరోసారి మార్చింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు సుమారు 6 గంటలు ఆలస్యంగా అంటే రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని సరి చూసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎవరూ ఊహించని విధంగా ఇది తెలంగాణపై తన ప్రతాపాన్ని చూపించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నీట మునిగింది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు భారీ వరదలకు పలు చోట్లు రైల్వే ట్రాకులపై నీరు నిలిచింది. కొన్ని చోట్ల ట్రాక్‌లు కూడా కొట్టుకపోయిన పరిస్థితి. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌ మారింది.


ఈ నేపథ్యంలో ప్రయాణికులను రైల్వే శాఖ అలర్ట్ చేసింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం మధ్యాహ్నం సికింద్రబాద్ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే రైల్వే అధికారులు దీన్ని రీషెడ్యూల్ చేశారు. శుక్రవారం రాత్రి 9గంటలకు ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని ప్రకటించారు. అంటే ఈ రైలు సుమారు 6 గంటలు ఆలస్యంగా నడవనుంది. గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మధ్యాహ్నం 3గంటలకు స్టార్ట్ కావాల్సిన ట్రైన్.. రాత్రి 11.35 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది.

ప్రయాణికులకు విజ్ఞప్తి

ఈ రీషెడ్యూల్ కారణంగా, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే శాఖ కోరింది. టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పును గమనించి, రైలు స్టేషన్‌కు కొత్త సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. కాగా సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా 8 గంటల 35 నిమిషాల వ్యవధిలో 699 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. రీషెడ్యూల్ కారణంగా ఈ స్టేషన్లలో రైలు రాకపోకల సమయాలు కూడా మారే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.