ఏపీలో ప్రజారవాణాశాఖ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఎప్పటి నుంచో అడుగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రయోజనం చేకూరబోతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ తీపికబురు చెప్పింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకూ ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 తర్వాత రిటైరైన వారికి ఈహెచ్ఎస్ వర్తింపచేయబోతున్నారు.
ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. విశ్రాంతి ఉద్యోగి భార్యకు కూడా ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం, మందులు అందించాలని ఆదేశించారు.
సూపరింటెండెంట్ కేటగిరీ వరకు రూ.38,572 ప్రీమియం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారు రూ.51,429 చెల్లించాలని తెలిపారు. ఆర్టీసీ ఆస్పత్రుల సిఫారసు మేరకు ఈహెచ్ఎస్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవచ్చు. రెగ్యులర్ ఉద్యోగుల్లా రియంబర్స్‌మెంట్ సౌకర్యం కూడా కల్పించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ సంఘాలు ఎన్‌ఎంయూ, ఈయూ సంతోషం వ్యక్తం చేశాయి. సీఎం, ఆర్టీసీ ఎండీ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపాయి.
2020కు ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్ఈఎంఎస్ పథకాన్ని పునరుద్ధరించారు. ఆర్టీసి విలీనానంతరం నిలిపివేసిన రిటైర్డు ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2020కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు REMS స్కీమ్ కింద జీవితకాల వైద్యసదుపాయాలు పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తాజా ఆదేశాలతో 2020కు ముందు, తర్వాత రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాలు చేకూరతాయి.
































