కందిపప్పును ఈ వ్యక్తులు అస్సలు ముట్టుకోకూడదు.. తింటే అంతే సంగతులు..

ప్రోటీన్, ఐరన్‌తో సమృద్ధిగా ఉండే కందిపప్పు శరీరానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఇదే కందిపప్పు కొంతమందికి ప్రమాదకరం.. విషం లాంటిది కావచ్చు. అధికంగా తీసుకోవడం వల్ల వివిధ వ్యాధులు వస్తాయి. కందిపప్పు ఎవరు తినొద్దు.. ఎటువంటి సమస్యలు వస్తాయి..? అనేది తెలుసుకుందాం..

పప్పుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రోటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కందిపప్పును చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ రుచికరమైన పప్పు కొందరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు. కందిపప్పును వీలైనంత వరకు తినకుండా ఉండాల్సిన వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.


కిడ్నీ సమస్యలు ఉన్నవారు

మూత్రపిండాల రోగులు కందిపప్పును తినడం చాలా హానికరం. కందిపప్పులో పొటాషియం అధికంగా ఉంటుంది. కిడ్నీ సరిగా పనిచేయనివారిలో అధిక పొటాషియం స్థాయిలు రక్తంలో పేరుకుపోయి, సమస్యలను మరింత పెంచుతాయి. ఈ పప్పును ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.

అధిక యూరిక్ యాసిడ్

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నవారు కందిపప్పును తినకూడదు. కందిపప్పులో ప్యూరిన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి, కీళ్ల నొప్పులు, వాపుకు దారితీస్తుంది. యూరిక్ యాసిడ్ రోగులు కందిపప్పుకు బదులుగా.. ప్యూరిన్ తక్కువగా ఉండే పెసర పప్పు లేదా మసూర్ పప్పును చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు.

కడుపు సమస్యలు ఉన్నవారు

కొంతమందికి కందిపప్పు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణవ్యవస్థ జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. మూలవ్యాధి ఉన్నవారిలో కందిపప్పు మలబద్ధకాన్ని మరింత పెంచి.. వాపు లేదా రక్తస్రావానికి దారితీయవచ్చు. కడుపు సమస్యలు ఉన్నవారు కందిపప్పు బదులు, సులభంగా జీర్ణమయ్యే పెసరపప్పును మితంగా తీసుకోవడం మంచిది.

అలెర్జీ సమస్యలు ఉన్నవారు

కొంతమందికి కందిపప్పులోని ప్రోటీన్‌కు అలెర్జీ ఉండవచ్చు. ఇది ఒక రకమైన ఆహార అలెర్జీ. ఈ ప్రోటీన్‌ను శరీరం హానికరమైనదిగా భావించి.. హిస్టామిన్ వంటి రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల చర్మపు దద్దుర్లు, దురద లేదా ఇతర అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి.

మీకు పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే.. కందిపప్పును పూర్తిగా తినకుండా ఉండటమే ఉత్తమం. ఇతర పప్పుధాన్యాలు తినాలనుకున్నా, చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

గమనిక : ఈ వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య పరిస్థితికి చికిత్స, ఆహార మార్పుల కోసం అర్హత గల ఆరోగ్య నిపుణుడి సలహా తప్పనిసరి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.