కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యేటా నిర్వహిస్తున్న నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ- నెట్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాలురు, బాలికలకు సీబీఎస్‌ఈ అనుబంధ విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా..
నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ- నెట్స్ 2026 పథకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యేటా నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాలురు, బాలికలకు సీబీఎస్‌ఈ అనుబంధ విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. శ్రేష్ఠ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్సీ స్కూళ్లలో దాదాపు 3వేల సీట్లను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 11, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేస్తారు.
స్కీం ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై క్లాసెస్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ (శ్రేష్ఠ) 2026 పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 2025-26 విద్యా సంవత్సరంలో 8, 10వ తరగతి చదువుతూ ఉండాలి. ఎస్సీ వర్గానికి చెందిన బాలబాలికలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.
విద్యార్ధుల వయసు తొమ్మిదో తరగతికి అయితే ఏప్రిల్ 1, 2010 నుంచి మార్చి 31, 2014 మధ్య జన్మించి ఉండాలి. అంటే మార్చి 31, 2026 నాటికి 16 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇక పదకొండో తరగతి విద్యార్థులు ఏప్రిల్ 1, 2008 నుంచి మార్చి 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. అంటే మార్చి 31, 2026 నాటికి 18 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 9, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష డిసెంబర్ 21, 2025వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే 3 గంటల వ్యవధిలో ప్రవేశ పరీక్ష ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) విధానంలో ఉంటుంది. రాత పరీక్ష అనంతరం 4 నుంచి ఆరు వారాల్లోపు ఫలితాలు వెల్లడిస్తారు.
































