హీరో విడా నుంచి త్వరలో ఎలక్ట్రిక్‌ బైక్‌.. స్పోర్టీ లుక్‌తో టీజర్‌

విడా బ్రాండ్‌పై విద్యుత్‌ వాహన రంగంలోకి ప్రవేశించిన హీరో మోటోకార్ప్‌.. త్వరలో ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను (Hero Vida Electric bike) విడుదల చేయనుంది. విడా బ్రాండ్‌ పైనే ఈ విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని తీసుకొస్తోంది. ఇటలీలోని మిలాన్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఆటో ఎగ్జిబిషన్‌ EICMA 2025 వేదికగా దీన్ని ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ VXZ పేరుతో కంపెనీ ఓ టీజర్‌ను విడుదల చేసింది.


టీజర్‌ ప్రకారం డిజైన్‌ పూర్తిగా రివీల్‌ అవనప్పటికీ.. కొంత భాగం కనిపిస్తోంది. స్పోర్టీ లుక్‌తో ఈ మోటార్‌ సైకిల్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. షార్ప్‌ హెడ్‌ల్యాంప్‌, టెయిల్‌ ల్యాంప్‌, స్ప్లిట్‌ సీటు ఇందులో ఉన్నాయి. విడా అనే అర్థం వచ్చేలా ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ డిజైన్‌ను హెడ్‌ల్యాంప్‌ పక్కన జోడించారు. వెడల్పాటి హ్యాండిల్‌ బార్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రాఫిక్‌, ఫీచర్లు, బ్యాటరీ వంటి వివరాలు త్వరలో తెలియరానున్నాయి. సాధారణంగా ఈ ఈవెంట్‌లో ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు త్వరలో తాము తీసుకురాబోయే మోడళ్లను ఇక్కడ ప్రదర్శిస్తుంటాయి. హీరోతో పాటు రాయల్‌ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్‌ వంటి కంపెనీలు తమ మోడళ్లను ప్రదర్శించనున్నాయి. నవంబర్‌ 6 నుంచి 9వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్‌ జరగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.