తెలంగాణలో తమకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో రిటైర్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
మార్చి 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు దాదాపు 14 వేల మంది ఉద్యోగులు రిటైర్ అవ్వగా.. వీరిలో కేవలం వెయ్యి మందికి మాత్రమే హైకోర్టు ఉత్తర్వుల ద్వారా.. వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా బకాయిలు అందాయి. మిగిలిన 13 వేల మందికి ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, రిటైర్ ఉపాధ్యాయుడు కందుకూరి దేవదాసు తెలిపారు. 13 వేల మందికి ఒక్కొక్కరికి వారి సర్వీస్ హోదాను బట్టి.. వారు సర్వీసులో జీపీఎఫ్‌లో చేసిన పొదుపులను బట్టి ఒక్కొక్కరికి 35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు రిటైర్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు.
“యావరేజ్‌గా 50 లక్షల రూపాయల చొప్పున లెక్కించినా.. రూ.6500 కోట్లు ప్రభుత్వం రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ టీజీఈజీజేఏసీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మిగతా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రూ.16 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని తప్పుడు లెక్కలు చెప్తున్నారు. వాళ్లు ఎలా లెక్క వేసినా రూ.16 వేల కోట్లు అవ్వదు. ఇది ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడమే కాకుండా రిటైర్ అయిన పెన్షనర్లను బాధించడం తప్ప వేరేది కాదు.
కానీ ప్రభుత్వానికి రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలనే ఉద్దేశంలో కనబడడం లేదు. రిటైర్ అయిన వాళ్లే కదా వీళ్లతో పనేముంది..? వీరికి ఎందుకు చెల్లించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే విషయం మరవకూడదు. మాకు బకాయిలు రాకపోవడంతో పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక, పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక ఇలా అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో మానసిక ఆవేదనతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది రిటైర్మెంట్ ఉద్యోగులు మరణించారు.
ఇంకా ఎంతమంది పెన్షనర్లు చనిపోతే రిటైర్మెంట్ బకాయిలు చెల్లిస్తారు ముఖ్యమంత్రి గారు..? పెన్షనర్ల చావులకు ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా..? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామన్నారు. పెండింగ్ డీఏలన్నింటిని వెంటనే విడుదల చేస్తామని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు నగదు రహిత హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్లో అమలు అయ్యే విధంగా విడుదల చేస్తామన్నారు. ఈ హామీలన్నీ అమలు చేశారా..? పెన్షనర్లకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం న్యాయమా..?
ఇటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నాం. మా జీపీఎఫ్ నిధులు కూడా వాడుకొని ప్రభుత్వము మాకు ఇవ్వకపోవడం ఎంతవరకు ఎంతవరకు సమంజసం..? మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఈ విధంగా పెన్షనర్లను వేధించడం సరైన విధానం కాదు. మార్చి 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు చేసి.. ప్రజలకు సేవలు అందించారు. మా సమస్యలను ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పట్టించకోవడం లేదు. ప్రభుత్వానికి కొంతమంది నాయకులు వత్తాసు పలుకుతున్నారు.
ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మాకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలన్నింటిని ఒకేసారి చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రిటైర్మెంట్లు ప్రారంభమై 19 నెలలు గడచినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల బకాయిల సాధన కమిటీని అన్ని జిల్లాలలో ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం. త్వరలో రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 17వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం బాధిత కుటుంబాలతో చేపట్టబోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆలోచించి నవంబర్ 15వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని విన్నవిస్తున్నాం. 13 వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆశతో ఎదురుచూస్తున్నాం..” అని రిటైర్మెంట్ ఉద్యోగుల ఆవేదననను తన మాటల్లో చెప్పుకొచ్చారు రిటైర్డ్ ఉపాధ్యాయులు కందుకూరి దేవదాసు.
































