ఒకప్పుడు తపాల శాఖ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఉత్తరాలు మాత్రమే. ప్రజలు పోస్టల్ వ్యవస్థ ద్వారా సుదూర ప్రాంతాలకు ఉత్తరాలను పంపేవారు.
అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా తపాల శాఖలో కూడా అనేక మార్పులు జరిగాయి. కేవలం ఉత్తరాలు(Letters), ఇతర సమాచారమే కాకుండా అనేక కొత్త సదుపాయాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులకు ధీటుగా ఈ పోస్టల్ వ్యవస్థ పని చేస్తుంది. ఈ క్రమంలోనే పోస్టల్ సేవల(Postal Services)ను ప్రజలకు మరింత చేరువ చేసేలా తపాలా శాఖ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ సేవలను మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు ‘డాక్ సేవ’ (Dak Seva)అనే కొత్త యాప్‌ను తెచ్చింది.
పోస్టల్ డిపార్ట్‌మెంట్ అందించే సేవలన్నీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే వినియోగించుకునేలా ‘డాక్ సేవ'(Dak Seva) యాప్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు పొందొచ్చు. ‘ఇక పోస్టాఫీస్ మీ జేబులోనే’ అంటూ యాప్ ను పరిచయం చేస్తూ.. పోస్టల్ డిపార్ట్‌మెంట్(Postal Department) తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టింది. తపాలా శాఖ అందించే అన్ని సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. పార్సిల్ ట్రాకింగ్, పోస్టేజ్ కాలిక్యులేషన్, ఫిర్యాదు నమోదు, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ వంటి సేవలను డాక్ సేవ యాప్ లో పొందొచ్చు.
స్పీడ్‌పోస్ట్(Speed Post), మనీ ఆర్డర్(Money Order) వివరాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ పార్శిల్ సేవలకు ఎంత ఛార్జీ అవుతుందో వెంటనే లెక్కించొచ్చు. స్పీడ్‌పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు, పార్సిల్ బుకింగ్ సేవల కోసం గంటల తరబడి లైన్లో నిలబడే అవసరం లేకుండా యాప్ ద్వారానే చేసుకోవచ్చు. అలానే జీపీఎస్ సాయంతో సమీపం పోస్టాఫీసుల వివరాలు తెలుసుకోవచ్చు. కార్పొరేట్ వినియోగదారుల(Corporate Customers) కోసం ప్రత్యేక విభాగం ఈ యాప్‌లో ఏర్పాటు చేశారు.
































