రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఎలక్ర్టికల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ తోడ్పాటు అందిస్తున్నది. ఎలక్ర్టికల్ విభాగంలో ఐటీఐ లేదా పాలిటెక్నిక్ పూర్తి చేసి, మూడు నుంచి ఐదేళ్ల వరకు వృత్తి అనుభవం వున్న నిరుద్యోగ యువకుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. నవంబరు 10వ తేదీ వరకే గడువు వుంది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో దళారుల చేతుల్లో మోసపోకుండా వుండేందుకు ‘ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ ఆఫ్ ఏపీ’తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ టైఅప్ పెట్టుకున్నది.
పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి రాజమహేంద్రవరంలో ఎనిమిది నుంచి పది వారాలపాటు జర్మనీ భాష, వృత్తి పరమైన శిక్షణ ఇస్తారు. ఇందుకు రూ.50 వేలు ట్రైనింగ్ ఫీజు (ఈఎంఐ సదుపాయం ఉంది), రూ.10 వేలు రిజిసే్ట్రషన్ ఫీజును దరఖాస్తుదారుడు భరించాలి. జర్మనీలో ఉద్యోగంలో చేరిన మూడు నెలల తర్వాత ఈ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత వీసా, విమానం ఖర్చులను జర్మనీ కంపెనీ భరిస్తుంది. నెలకు జీతం 2,600 నుంచి 3,000 యూరోలు (సుమారు రూ.3 లక్షలు) ఇస్తారు. దరఖాస్తుదారుని వయస్సు 18 నుంచి 40 సంవత్సరాలలోపు ఉండాలి. కంపెనీతో చేసుకున్న ఒప్పదం మేరకు రెండేళ్లు అక్కడ పనియాల్సి ఉంది.
ఐటీఐ పూర్తి చేసిన వారికి రాజమహేంద్రవరంలో జర్మనీ భాష, వృత్తి పరంగా రోజుకు ఎనిమిది గంటల చొప్పున 12 నుంచి 14 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో వసతి, భోజనం సదుపాయాలను ఏపీఎస్‌ఎస్‌డీసీ కల్పిస్తుంది. ట్రైనింగ్ ఫీజు రూ.1.15 లక్షలు దరఖాస్తుదారుడు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం జర్మనీ వెళ్లడానికి వీసా, విమానం ఖర్చులను కూడా దరఖాస్తుదారుడే భరించాలి. జర్మనీలో ఉద్యోగంలో చేరిన తరువాత ఆరు నెలలపాటు ప్రొబేషన్ కాలం. ఈ సమయంలో 1,000 యూరోలు ఇస్తారు. తరువాత జీతం నెలకు 2,600 నుంచి 2,700 యూరోలు చెల్లిస్తారు. కంపెనీ ఒప్పందం మేరకు కనిష్ఠంగా రెండేళ్లు అక్కడ పని చేయాల్సి వుంటుంది.

































