ఈ ట్రాన్సాక్షన్స్ చేస్తే అడ్డంగా బుక్కైపోతారు.. ఐటీ శాఖ నజర్

న దేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థ కింద.. నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటినట్లయితే అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత, కొత్త పన్ను ఆదాయపు పన్ను విధానాల్లోని..


టాక్స్ శ్లాబుల ఆధారంగా టాక్స్ చెల్లించాలి. ఇది ఆదాయం పెరిగిన కొద్దీ.. పెరుగుతుంటుందని గుర్తుంచుకోవాలి. అయితే.. ఇక్కడ పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు తప్పుడు మార్గాల్ని ఎంచుకునే వారు చాలా మందే ఉంటారు. ఆదాయ పరిమితికి మించి ఆర్జించినా.. టాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటుంటారు. అయితే.. గత కొంత కాలంగా ఆదాయపు పన్ను విభాగం గట్టి నిఘా ఉంచింది. ఎక్కడైనా దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తేలితే.. నోటీసులు పంపించడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తోంది. ఇక్కడ మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న విషయాల్లోనూ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇందులో బ్యాంక్ లావాదేవీల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ పెద్ద మొత్తంలో మీరు మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు డిపాజిట్ చేయడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకటి లేదా అన్ని సేవింగ్స్ అకౌంట్లు కలిపి రూ. 10 లక్షలు లేదా అంతకుమించి ఒక ఆర్థిక సంవత్సరంలో జమ చేసినట్లయితే.. ఇలాంటి విషయాల్లో ఐటీ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ బ్లాక్ మనీని అరికట్టేందుకు గతంలో ఐటీ శాఖ ఈ పరిమితి విధించింది.

>> ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) మీ వద్ద ఉన్నటువంటి అన్ని పొదుపు ఖాతాల్లో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ రూపంలో డిపాజిట్ చేస్తే.. సదరు బ్యాంక్ ఐటీ శాఖకు కచ్చితంగా దీనిని నివేదించాల్సి ఉంటుంది. ఈ పరిమితి దాటితే.. మీరు దానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌లో పేర్కొనకపోతే తప్పించుకోలేరు. ‘అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.’ అని ప్రశ్నిస్తూ.. ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. ఇక్కడ మీరు కచ్చితంగా దానికి మూలం చెప్పాలి. అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అయినప్పటికీ.. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది చెప్పగలగాలి.

ఇక్కడ మీరు డిపాజిట్ చేసిన నగదుపై వెంటనే టాక్స్ పడకపోవచ్చు కానీ.. ఆ డబ్బును మీరు ఇప్పటికే పన్ను కట్టిన ఆదాయం నుంచి లేదా చట్టబద్ధమైన వనరులు (వ్యవసాయం లేదా ఆస్తి అమ్మకం) నుంచి వచ్చిందని నిరూపించకపోతే.. దాన్ని లెక్క చూపని ఆదాయం కింద పరిగణించి.. భారీ జరిమానాతో పన్ను విధిస్తారు. అంటే.. మీరు ఇక్కడ టాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినట్లుగానే ఐటీ శాఖ భావిస్తుంది.

ఇటీవల ఇలాగే నగదు డిపాజిట్‌కు సంబంధించి.. మిస్టర్ కుమార్ అనే వ్యక్తి నోటీసు అందుకున్నారు. తన అకౌంట్లో రూ. 8.68 లక్షలు జమ చేసినందుకు నోటీసులు వచ్చాయి. ముందుగా ఐటీ అధికారి కేవలం ఆ డబ్బు మూలం మాత్రమే చూడాలనుకున్నారు. కానీ ఆ అధికారి మాత్రం పరిధిని దాటి.. ఆ డబ్బును వ్యాపారం ద్వారా వచ్చిన లాభంగా ప్రకటించి.. అదనపు పన్ను విధించారు. అయితే ఇక్కడ కుమార్ హైకోర్టుకు వెళ్లగా.. ఇన్‌కంటాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్.. ఆ అధికారి నిర్ణయాన్ని కొట్టివేసింది. ఒక పన్ను అధికారి.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా.. నగదు మూలం పరిధిని దాటి మొత్తం వ్యాపార ఆదాయాన్ని పరిశీలించకూడదని కోర్టు స్పష్టం చేసింది.

ఇలాంటి సందర్భాల్లో మీరు ఐటీ నోటీసులు రాకుండా ఉండాలంటే.. పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయకపోవడమే మంచిది. ఒకవేళ జమచేసినా.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది స్పష్టంగా చూపించేందుకు ప్రతి డాక్యుమెంట్ సిద్ధంగా ఉంచుకోవాలి. అంటే పాత పొదుపు, ఆస్తి అమ్మకం ద్వారా వచ్చిందని లేదా వారసత్వంగా వచ్చిందనేది చూపగలగాలి. మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు చూపిన ఆదాయానికి.. బ్యాంక్ డిపాజిట్లకు మధ్య పొంతన ఉండాలి. ఆదాయానికి మించి డిపాజిట్లు ఉంటే అనుమానం వస్తుంది. ఇంకా మరీ ముఖ్యమైనది ఐటీ నోటీసు వచ్చినప్పుడు భయపడకుండా.. నిర్ణీత సమయంలోగా మీ డాక్యుమెంట్లు జత చేసి సరైన వివరణ ఇవ్వాలి. ఆ నగదు చట్టబద్ధమైనదని నిరూపించగలిగితే అప్పుడు తప్పించుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.