ప్రతి ఇంటి ముంగిట్లో రంగు రంగుల రంగవల్లికలు.. భోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేసే పిల్లలు, బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందేలు.. ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం.. ఓ ఎమోషన్. అంగరంగ వైభవంగా చేసుకునేసంక్రాంతి పండుగ 2026 తేదీలు, విశిష్టత తెలుసుకుందాం.. కాలచక్రానికి అధిపతి సూర్యుడు (Sun). సూర్యుడి అధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో ఏడాదికి రెండు ఆయనాలు వస్తాయి. అవిఒకటి దక్షిణాయనం కాగా, రెండోది ఉత్తరాయణం. ప్రతియేటా జనవరి నెల సంక్రాంతి పండుగ సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీన్నే ఉత్తరాయణం పుణ్యకాలంగా పిలుస్తాం. ఈ సమయంలోనే పంటలూ చేతికొస్తాయి. అందుకే సంక్రాంతి పండుగకి ఒక వైపు సూర్యారాధన చేస్తూనే మరోవైపు ఆహారం ఇచ్చే నేలతల్లినీ అందమైన రంగవల్లికలతో, పుష్పాలతో పూజిస్తాం. ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగతో మొదలై ముక్కనుమ లేదా కనుమ పండుగతో ముగుస్తుంది.సంక్రాంతి 2026 తేదీలు
జనవరి 13 మంగళవారం : భోగి పండుగ (Bhogi 2026)
జనవరి 14 బుధవారం : ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి (Makar Sankranti 2026)
జనవరి 15 గురువారం : కనుమ పండుగ (Kanuma 2026)
భోగి పండుగ 2026 మంగళవారం జనవరి 13వ తేదీన జరుపుకోనున్నారు. ప్రతియేటా సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే ప్రారంభమవుతుంది. ఈ భోగి రోజు భోగి మంటలు వేస్తారు. ఉత్తరాయణ కాలం ప్రారంభమయ్యే ముందురోజు బాగా విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామునే భోగి (Bhogi 2026) మంటల్ని వేస్తారు. గోదాదేవి ధనుర్మాసం తొలి రోజు నుంచి తిరుప్పావై పాశురాలతో రంగనాథ స్వామిని ఆరాధించి భోగి పండుగ రోజే వివాహమాడి స్వామి వారిలో లీనమవ్వడం వల్లే ఈ భోగి పండుగ వచ్చిందనే కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగి పండుగతో ముగుస్తుంది. ఇక భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలపై కొత్త బెల్లం, కొత్త బియ్యం, ఆవు పాలతో పొంగలి చేసి సూర్యభగవానుడికి నివేదించడం ఆనవాయితీ. అలాగే భోగి రోజు సూర్యాస్తమయంలోపు చిన్న పిల్లలకు భోగిపళ్లు పోయడం కూడా మనం తరచూ చూసే ఓ సంప్రదాయమే. ఇక తెలంగాణలో అయితే భోగినోము పేరుతో ప్రత్యేక వ్రతం కూడా చేస్తారు. మట్టి కుండల్లో నువ్వుల ఉండలు, జీడిపళ్లు, చిల్లర డబ్బులు, చెరకు ముక్కలు వేసి వాటిని ఇరుగుపొరుగు వారికి, బంధుమిత్రులకు వాయినాలుగా ఇస్తారు.
భోగి పండుగ మరుసరి రోజు వచ్చే పండుగే మకర సంక్రాంతి. 2026లో సంక్రాంతి పండుగ జనవరి 14 బుధవారం రోజు జరుపుకోనున్నారు. సూర్యుడు (Sun) మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజును మకర సంక్రాంతి (Makar Sankranti) లేదా మకర సంక్రమణంగా పిలుస్తారు. ఈ రోజు నుంచీ ఉత్తరాయణ పుణ్యకాలం (Uttarayana Punyakalam 2026) ప్రారంభమవుతుంది. ఇక సంవత్సరం మొత్తం చేసే దానధర్మాలతో పోలిస్తే ఈ మకర సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయ (కూష్మాండం) దానం చేయడం వల్ల పితృ దేవతలు సంతృప్తి చెంది సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే నువ్వులు కూడా ఏదో ఒక రూపంలో సంక్రాంతి రోజు తీసుకుంటే ఆరోగ్యంతో పాటూ ఆయుష్షూ పెరుగుతుందని చెబుతారు. ఇక తెల్ల నువ్వులు దేవతార్పణం కోసం, నల్ల నువ్వులు పితృతర్పణం ఉపయోగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
2026లో కనుమ పండుగను జనవరి 15 గురువారం రోజు జరపుకోనున్నారు. సూర్యుడు (Sun) మేష రాశిలోకి ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ కనుమ రోజును మేష సంక్రాంతిగా పిలుస్తారు. ఇక ఈ కనుమ పండుగ అంతరార్థం ఏమిటంటే.. ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేయాలి అన్నదే కనుమ పండుగ అంతరార్థం. మానవ మనుగడకు మూలాధారమైన పశువులకు, జంతువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఈ కనుమ పండుగ ప్రధాన ఉద్దేశం. కనుమ పండుగ రోజు రైతులు ముందుగా పశుశాలను శుభ్రం చేసి గోవుల్నీ, గేదెల్ని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పూజిస్తారు. సాయంత్రం పూట మేళతాళాలతో ఊరేగిస్తారు.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటికి ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.






























