చెన్నై వందేభారత్ నర్సాపురంకు పొడిగింపు, మరో రెండు హాల్టులు – కొత్త టైమింగ్స్

రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న వందేభారత్ నర్సాపురం వరకు పొడిగింపు నిర్ణయానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ రైలుకు గుడివాడతో పాటుగా భీమవరంలోనూ హాల్టింగ్ సౌకర్యం కల్పించింది.


ఈ రైలు పొడిగింపుతో తాజా టైమింగ్స్ ను ఖరారు చేసింది. దీని ద్వారా ఇక నుంచి గోదావరి వాసులు చెన్నై వెళ్లేందుకు వందేభారత్ ద్వారా మరింత వెసులుబాటుగా మారనుంది. త్వరలోనే ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది.

రైల్వే బోర్డు గోదావరి వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ను నర్సాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చెన్నై సెంట్రల్ లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే వందేభారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 12.10 కి చేరుకుంటోంది. ఇక, ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించటంతో ఈ సర్వీసు 11.45 గంటలకు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి 11.50కి బయల్దేరి.. మధ్యాహ్నం 12.25కి గుడివాడ, 1.30కి భీమవరం, 2.10 కి నర్సాపురం చేరుకుంటుంది.

ఇక, తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు నరసాపురంలో బయలుదేరి 3.20కి భీమవరం, 4.10 కి గుడివాడ, 4.50 కి విజయవాడ చేరుతుంది. ఇక్కడి నుంచి 4.55 గంటలకు బయల్దేరి సాయంత్రం 5.20కి తెనాలి, 6.30కి ఒంగోలు, రాత్రి 7.40కి నెల్లూరు, 8.50కి గూడూరు, 9.50 కి రేణిగుంట మీదుగా రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ కు చేరుతుంది. ఇక.. తాజాగా పొడిగించిన మేరకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం ప్రారంభం కానుంది. నర్సాపురంలో ఈ రైలు సర్వీసును అధికారికంగా ప్రారంభించేందుకు ముహూర్తం పైన కసరత్తు జరుగుతోంది. ఈ నెలలోనే ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా, విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా మరో వందేభారత్ సర్వీసు ప్రారంభం పైన అధికారులు ఫోకస్ చేసారు. త్వరలోనే ఈ సర్వీసు పైనా నిర్ణయం ఉంటుందని .. ఇప్పటికే షెడ్యూల్ సైతం ఖరారైందని అధికారులు వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.