టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణం గా మార్పులకు సిద్దమైంది. సాంకేతికతను వినియోగించుకొని సేవలు పెంచాలని డిసైడ్ అయింది.
అదే విధంగా డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, శ్రీవారి దర్శనం.. వసతి కేటాయింపు పైన టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక అంశాలను వెల్లడించారు.
టీటీడీ పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సమయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తాము ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు.. భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తయ్యేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం ఏఐ సాయంతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, త్వరలోనే భక్తులకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు.
శ్రీవాణి ట్రస్టు కింద దళిత వాడల్లో వెంకన్న ఆలయాలను నిర్మించనున్నా మని, ప్రాథమికంగా 5వేలకు పైగా వాడల్లో నిర్మాణాలను ప్రతిపాదించినట్టు తెలిపారు. దేశ వ్యాప్తం గా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి గుడులు నిర్మించేలా కార్యాచరణ రూపొందించామని వివరించారు. తిరుమల కొండ కింద సుమారు 50 ఎకరాల్లో 25వేల మంది భక్తులకు వసతి, మౌలిక సౌకర్యాలు కల్పించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
అదే విధంగా తిరుపతి విమానాశ్రయానికి ‘శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేశామని, ఈ ఫైలును క్యాబినెట్‌కు పంపామని, ఆమోదం పొందాక కేంద్రానికి పంపనున్నట్టు వివరించారు. వైసీపీ హయాంలో తిరుపతి ఫ్లైవోవర్‌కు పెట్టిన ‘శ్రీనివాస సేతు’ పేరును మళ్లీ ‘గరుడ వారధి’గా మార్చామని తెలిపారు. విశాఖ శారదా పీఠానికి కొండపై కేటాయించిన భూముల లీజులను రద్దు చేశామని చెప్పారు.
దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల్లో నిత్యాన్నదానం చేయనున్నట్టు తెలిపారు. ఏడాది పాలనలో రూ.1,000 కోట్ల విరాళాలు వచ్చాయని చెప్పారు. ఒంటిమిట్ట ఆలయం వద్ద 100 గదులతో వసతి గృహం నిర్మాణంతో పాటు 108 అడుగుల జాంబవంతుని విగ్రహం ఏర్పాటుచేయనున్నట్టు బీఆర్ నాయుడు వివరించారు.































