తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల బంద్‌కు ముగిసింది. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతంగా ముగిశాయి.
వివరాలు… ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 50 శాతం చెల్లించాలని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (FATHI) డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే నిరసనలో భాగంగా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల బంద్ కొనసాగుతుంది. అయితే తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని… నవంబర్ 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధ్యాపకులతో భారీ సభను నిర్వహించనున్నట్టు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వెల్లడించింది.
మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థల వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికారులతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వంతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు సఫలం అయ్యాయి. ప్రభుత్వం దశల వారీగా రూ. 1,500 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది. ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేసామని… మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని, మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి, యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలపై చర్చించనున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య బంద్‌తో సహా అన్ని నిరసన కార్యక్రమాలను రద్దు చేసింది. బంద్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను త్వరలో రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. తమ డిమాండ్లపై సానుకూల వైఖరి కనబరిచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
ఇక, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలలో 50 శాతం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలను నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. అయితే తాజాగా ప్రభుత్వంతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కాలేజ్‌లు యథావిధిగా తెరుచుకోనున్నాయి.
































