శబరిమలకు వెళ్లే అయ్యప్పలకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు ప్రతీ ఏటా శబరిమల వెళ్తూ ఉంటారు. ఈ ఏడాది అయ్యప్ప దీక్ష తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఇక.. శబరిమలలో వసతి సౌకర్యం పైన ఆలయ అధికారులు కీలక ప్రకటన చేసారు. పూజ, వసతి కోసం కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించారు.
అయ్యప్ప భక్తులు ఆన్ లైన్ సేవలు సన్నిధానంలో పూజ, వర్చువల్ క్యూ బుకింగ్, ఆన్‌లైన్ వసతి బుకింగ్ సేవలు నవంబర్ 5న ప్రారంభించింది. అయితే రద్దీ కారణంగా రెండు రోజులు ఈ సైట్ పనిచేయలేదు. బుకింగ్ సాధ్యపడలేదని భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. రోజూ 70వేలకు పైగా భక్తులు వర్చువల్ క్యూ వెబ్‌సైట్ ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించినప్పటికీ చాలా మంది భక్తులు పాస్‌వర్డ్ అందకపోవడంతో లాగిన్ అవ్వలేక పోయారు. దీని పైన ఫిర్యాదులు అందాయి. అయితే, ఒకే సమయంలో ఎక్కువమంది లాగిన్ చేయడం వల్ల వెబ్‌సైట్ డౌన్ అయిందని, సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య ఎదురవుతోందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు వివరించింది.
ఇక.. భక్తుల కోసం వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, నీలక్కల్(శివం), పంబా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రియల్ టైమ్ బుకింగ్ కేంద్రాలు కూడా ఉంటాయి. ఒక రోజులో గరిష్టంగా 20వేల మంది భక్తులకు రియల్ టైమ్ బుకింగ్ ద్వారా దర్శనం అవకాశం కల్పిస్తున్నారు. సన్నిధానంలో పూజ, వర్చువల్ క్యూ బుకింగ్, ఆన్‌లైన్ వసతి సేవల కోసం భక్తులు www.onlinetdb.com వెబ్‌సైట్ సందర్శించాలి. ముందుగా వెబ్‌సైట్‌లో పేరు, ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత పాస్‌వర్డ్ వస్తుంది. ఆ తర్వాతే మీరు లాగిన్ చేసుకుని ఆపై గదులు మొదలైనవి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. శబరిమలలో వసతి రూ.80 నుంచి అదుబాటులో ఉంది. గది స్థాయిని బట్టి రూ.2,200 వరకు ఫీజు వసూలు చేస్తారు.గదులు బుక్ చేసుకోవాలను కునే యాత్రికులకు ఆన్‌లైన్ సేవల కోసం నమోదు చేసుకోవడానికి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా అవసరం. గదిని ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో మీరు అందించిన అదే ఫొటో సహా IDని తీసుకెళ్లాలి.































