బంగారం.. బీకేర్‌ఫుల్‌

కార్తికమాసంతో పెళ్లిళ్ల సీజన్‌ పునఃప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని యువతీ యువకులు వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంబంధాలు కుదిరిన వారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనివార్యం. నెల రోజుల క్రితం 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1.33 లక్షలకు ఎగబాకి దడపుట్టించగా ప్రస్తుతం ఆ ధర రూ.1.24 లక్షలకు పడిపోయి కాస్త ఉపశమనం కలిగించింది.


ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ షురూ కావడంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు గిరాకీ పెరుగుతోంది. ఈక్రమంలో కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమాత్రం ఎమరుపాటుగా వ్యవహరించినా నష్టపోక తప్పదు. నిశిత పరిశీలన, నిర్ధారణ, అప్రమత్తంగా ఉండటం అనివార్యమైన అంశాలుగా వినియోగదారులు గుర్తించాలని మంచిర్యాల జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి విజయ్‌కుమార్‌ సూచిస్తున్నారు. పాటించాల్సిన అంశాలను ‘సాక్షి’కి వివరించారు.

  • ఇవి పరిశీలించాలి 
    బంగారం తూకం వేసేందుకు జ్యూవెల్లరీ షాపుల్లో వేయింగ్‌ మిషన్‌ వినియోగిస్తారు. దానిని ప్రతీ సంవత్సరం లీగల్‌ మెట్రాలజీ అధికారులు పరిశీలించి సీలు వేస్తారు. ఆ మిషన్‌పై సీలు ఉందా.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ షాపు యజమానులు కలిగి ఉన్నారా? తెలుసుకోవాలి. అనుమానం వస్తే షాపు యాజమానిని అడిగి నిర్ధారణ చేసుకోవాలి.

  • వేయింగ్‌ మిషన్‌తో తూకంలో అనుమానం కలిగితే వెయిట్స్‌తో తూకం వేయించాలి

  • ఏదేనీ ఆర్నమెంట్‌ కొనుగోలు చేసినపుడు బంగారంతో పాటు రాగి, వెండి, పచ్చలు, రాళ్లు, వజ్రం ఉ ండవచ్చు. బిల్లు ఇచ్చేటప్పుడు ఆ ఆర్నమెంట్‌లో ఏ మేం ఉన్నాయి.. ఎంత శాతం ఉన్నాయో వివరా లు తప్పనిసరిగా బిల్లు రశీదులో నగల వ్యాపారి పొందుపర్చాలి.

  • అలా వివరాలు లేకపోతే నమోదు చేయించుకోవాలి. జీఎస్టీ నంబర్‌ ఉన్న రశీదు తీసుకోవాలి.

  • కొనుగోలు చేసిన ఆభరణం వెనకాల హగ్‌ మార్క్‌ గుర్తు ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి.

  • షాపు ముందు ధరల పట్టిక ప్రదర్శించాలి 
    జ్యువెల్లరీ షాపులో అమ్మకానికి పెట్టిన బంగారం, వెండి ధరలు ఏరోజుకారోజు తప్పనిసరిగా దుకాణం ముందు ప్రదర్శించాలి.

  • రెడీమేడ్‌ బంగారు ఆభరణాలలో వినియోగించే స్టోన్స్, సిల్వర్, కాపర్‌ ధర కూడా పట్టికలో విధిగా పొందుపర్చాలి.

  • మేకింగ్‌ చార్జీ ఆర్నమెంట్‌ రకాల ప్రకారంగా తేడా ఉంటుంది. చార్జీల అంశం లీగల్‌ మెట్రాలజీ నిబంధనల పరి«ధిలోకి రావు.

  • అందువల్ల జ్యువెల్లరీ షాపుల నిర్వాహకులు కొనుగోలు దారుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొనుగోలుదారు సొంత నిర్ణయం తీసుకోవాలి.

  • వేస్టేజీ చార్జీ ఎంత అనేది తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.

ఉమ్మడి జిల్లాలో 
ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉట్నూర్, ఖానాపూర్, కాగజ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 100 వరకు జ్యువెల్లరీ సేల్స్‌ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా ఏటా రూ.కోట్లలో బంగారం, వెండి ఆభరణాల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.

నమ్మకంతోనే కొనుగోళ్లు 
జ్యువెల్లరీ షాపుల్లో బంగారం, వెండి కొనుగోళ్లు చా లామట్టుకు నమ్మకంతోనే జరుగుతున్నా యి. స దరు షాపు యజమానుల నిజాయతీపై ఆ ధారపడి అమ్మకాలు సాగుతున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ఈతరం యువతీ యువకులు మాల్స్‌ ను ఆశ్రయిస్తుండగా తల్లిదండ్రులు మాత్రం వంశపారం పర్యంగా వస్తున్న జ్యువెల్లరీ షాపుకు వెళ్లి కొ నుగోలు చేయడానికి ఇష్టపడుతుండటం గమనార్హం.

శుభ ముహూర్తాలు ఇవే… 
వివాహాలకు శుభ గడియలు వచ్చేశాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 17 వరకు, తిరిగి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 11వ తేదీ వరకు దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. ఆతర్వాత ఉగాదికి కొత్త పంచాంగం వచ్చాక కానీ శుభముహూర్తాలు ఉండనున్నాయి.

బంగారం మార్పిడిలో మోసాలకు అవకాశం  
వివాహాది శుభకార్యాలకు చాలా మట్టుకు పాత బంగారం అప్పజెప్పి కొత్త బంగారం తీసుకునే క్రమంలో మోసం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాత బంగారం, వెండి ఆభరణాలకు తరుగు అధికంగా తీసి వినియోగదారులను మోసం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొలతల్లో, తరుగు విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా మరోషాపుకు వెళ్లి తూకం వేయించి నిర్ధారించుకోవాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.