బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు.
అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీని కంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్టు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసి, ఆ తర్వాత వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారి ఒకరు తెలిపారు.
కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. దక్షిణ భారతంపైకి చలిగాలులు వీస్తుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో చలితీవ్రత పెరిగింది.పాడేరు ఏజెన్సీ, తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్యకోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాఽధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. జి.మాడుగులలో 11.6, వజ్రకరూర్‌లో 11.8, అనంతపురంలో 15.5, ఆరోగ్యవరంలో 16, నందిగామ, జంగమహేశ్వరపురంలలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయవ్య, మధ్య, ఉత్తర భారతంలో కొనసాగుతున్న చలి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల చలి గాలులు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది.































