పరీక్ష లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్స్‌ – ఇక నుంచి నేరుగా, తాజా మార్పులు

డ్రైవింగ్ లైసెన్సుల జారీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శకంగా లైసెన్సుల జారీ దిశగా కసరత్తు చేస్తోంది. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి పరీక్ష లేకుండానే లైసెన్సు జారీ విధానం అమల్లోకి తెస్తోంది.


తాజాగా కేంద్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు మరో 53 అందుబాటులోకి వచ్చాయి. దీంతో, కొత్తగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో మార్పులు రానున్నాయి.

రాష్ట్రంలో డ్రైవింగ్స్ లైసెన్సుల జారీ మరింత పకడ్బందీగా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మంది సరైన శిక్షణ లేకుండానే లైసెన్స్‌ పొందడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో, రవాణాశాఖ ఈ సమస్యను గమనించింది. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 53 డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు (డీటీసీలు) స్థాపించడానికి ఆమోదం లభించింది.

అదనంగా 5 ప్రాంతీయ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలు (ఆర్‌డీటీసీలు) కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలు నడపడం నేర్పుతారు. ఇందులో శిక్షణ మూడు విధాలుగా ఉంటుంది, తరగతుల ద్వారా నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు సిమ్యులేటర్లపై డ్రైవింగ్‌ ప్రాక్టీస్, ప్రత్యేక ట్రాక్‌లపై ప్రాక్టీసు చేయించేలా నిర్ణయించారు.

కాగా, వీటిల్లో శిక్షణ పూర్తి చేసిన వారికి, రవాణాశాఖ ఆఫీసులో డ్రైవింగ్ పరీక్షకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. డీటీసీ నుంచి శిక్షణ సర్టిఫికెట్‌ పొందిన వారికి నేరుగా లైసెన్స్‌ జారీ చేస్తారు. ఇది డ్రైవింగ్‌ నేర్చుకోవాలనుకునే వారికి ఎంతో మేలు చేయనుంది. ఏయే లైసెన్సులకు ఎన్ని రోజులు ట్రైనింగ్..ఫీజలు వివరాలను వెల్లడించనున్నారు. రాష్ట్రానికి మంజూరైన 5 ఆర్‌డీటీసీలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

ఇక్కడ శిక్షణ పొందిన వారు లైసెన్స్‌ కోసం ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీస్‌కు వెళ్లకుండానే అక్కడికక్కడే లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసి మంజూరు చేస్తారు. ఇప్పటికే ఎన్టీఆర్, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి 2 చొప్పున, అనంతపురం, కృష్ణా, తిరుపతి, పశ్చిమగోదావరి, బాపట్ల, కాకినాడ జిల్లాల నుంచి 1 చొప్పున దరఖాస్తులు అందాయి. వచ్చే ఏడాది నాటికి అన్ని డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్ణయించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.