సాంప్రదాయంగా పెట్టుబడిదారులు బంగారం, వెండివైపే మొగ్గు చూపుతారు. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడంతో చాలా మంది పెట్టుబడిదారులు వీటినే భవిష్యత్తుకు చెందిన లోహాలుగా భావిస్తున్నారు.
అయితే సీనియర్ విశ్లేషకులు మాత్రం ఈ అభిప్రాయాన్ని ఖండిస్తున్నారు. భవిష్యత్తును నిర్మించగలిగే, వచ్చే దశాబ్దంలో అత్యధిక రాబడిని ఇచ్చే లోహం బంగారం-వెండి కాదని, రాగి మాత్రమే సరైన లోహమని గట్టిగా హెచ్చరిస్తున్నారు. రాగి విలువ రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో సంపద స్వరూపాన్ని మార్చగలదని.. అయితే పెరుగుతున్న ఈ డిమాండ్‌ను చాలా మంది భారతీయులు ఇంకా గుర్తించడం లేదని అభిప్రాయపడుతున్నారు.
రాగి.. భవిష్యత్తుకు ఆధారం
సుజయ్ అనే సీనియర్ విశ్లేషకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. “భారతీయులు బంగారం వెనుక పరుగులు తీస్తున్నప్పటికీ, రాబోయే దశాబ్దంలో అపారమైన వృద్ధిని చూపగల ఆస్తిని విస్మరిస్తున్నారు. రాగి మాత్రమే వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో సంపద స్వరూపాన్ని మార్చగల లోహం. దీని పెరుగుతున్న డిమాండ్‌ను చాలా మంది భారతీయులు గుర్తించడం లేదు.” అని ఆయన ఆయన పేర్కొన్నారు.
రాగి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాగి డిమాండ్‌కు ప్రధాన కారణం ప్రపంచం అంతటా పెరుగుతున్న ‘గ్రీన్ ఎకానమీ’, ‘విద్యుదీకరణ’. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర ఫలకాలు, ఛార్జింగ్ స్టేషన్లు, పవర్ గ్రిడ్లు, డేటా సెంటర్ల నిర్మాణానికి రాగి అత్యవసరం. ఇవన్నీ భవిష్యత్ విద్యుదీకరించబడిన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభాలుగా నిలవనున్నాయి. ఏఐ డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల కారణంగా రాగికి డిమాండ్ ఊహించని విధంగా పెరుగుతోంది.
సప్లైలో భారీ కొరత
డిమాండ్ ఒకవైపు పెరిగిపోతుంటే మరోవైపు రాగి సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది.ఇండోనేషియాలోని అతిపెద్ద రాగి గనులలో ఒకటైన ‘గ్రాస్బర్గ్’ ఇటీవల వరదలు, ప్రమాదాల కారణంగా ప్రభావితమైంది. దీని వల్ల 2026 నాటికి 6 లక్షల టన్నుల ఉత్పత్తి కొరత వచ్చే ప్రమాదం ఉంది. కొత్త రాగి గనిని తెరవడానికి 10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుత గనులు ఖాళీ అవుతున్నాయి లేదా వాటి నాణ్యత పడిపోతోంది. దీంతో 2020 తర్వాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా రాగి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది.
ధరల పెరుగుదల అంచనా
సరఫరాలో కొరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు పెరుగుతున్నాయి. 2026 నాటికి రాగి మార్కెట్లో గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 5.90 లక్షల టన్నుల కొరత ఏర్పడవచ్చు. 2029 నాటికి ఇది 1.1 మిలియన్ టన్నులకు పెరగవచ్చు. గోల్డ్‌మ్యాన్ సాచ్స్, సిటీ వంటి అంతర్జాతీయ సంస్థలు రాబోయే కొద్ది సంవత్సరాలలో రాగి ధర ప్రతి టన్నుకు 11,000 డాలర్ల నుంచి 14,000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాయి. ఇది ప్రస్తుత ధరల కంటే 20 శాతం నుండి 50శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
బంగారం VS రాగి: అసలు తేడా ఏంటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం, రాగి పాత్రలు పూర్తిగా విభిన్నం. “ఒక లోహం (బంగారం) లాకర్లో పడి ఉంటుంది, మరొకటి (రాగి) భవిష్యత్తును నడిపిస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు. బంగారం వేచి చూస్తుంటే, రాగి మాత్రం 24×7 పనిచేస్తుంది. ప్రస్తుతం రాగి గనుల యజమానులు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో రాగి ధరలు గణనీయంగా పెరగడం ఖాయమని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
































