Ahobilum – ఆహోబిలం వెనక దాగివున్న ఒక చారిత్రక సత్యం

అహోబిలాన్ని మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉంటుంది. నల్లమల కొండల్లో ఉండే అద్భుతమైన ప్రదేశం. కర్నూలు-కడప హైవే మీద ఉన్న ఆళ్లగడ్డ పట్టణానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడికీ చేరుకోవడం చాలా సులభం. ఇక్కడ ఉండే దేవుడు లక్ష్మీ సమేత నరసింహ స్వామి. ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య ఉంటుంది. ఆలయానికీ చేరుకోవడం, చేరుకున్నాక మీ కోసం అబ్బుర పరిచే విషయాలెన్నో ఎదురు చూస్తుంటాయి అక్కడ. ఇవన్నీ మీకు మ్యాగజైన్ లలో, బ్లాగులలో దొరుకుతాయి. అందుకే నేను ఆలయం, అక్కడి అందమైన పరిసరాల జోలికి వెళ్లకుండా అహోబిలం గురించి ఒక కొత్త విషయం చెబుతున్నా.


దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాముడు,కృష్ణుడు తర్వాత ఎక్కువ వినిపించే దేవుడి పేరు నరసింహుడిదే.
ఒక పది పన్నెండు మంది తెలుగు వాళ్లను ర్యాండమ్ గా ఎంపిక చేస్తే అందులో ఒకరైనా లక్ష్మీ నరసింహస్వామిని గుర్తు చేసే పేర్లు యాదగిరి, యాదమ్మ, యాదయ్య, ఓబులమ్మ ఓబులేసు, ఓబులరెడ్డి, సింహాచలం, సింహాద్రి, చలం వంటివి తగులుతాయి. అంతెందుకు ఒక నరసింహుడు ప్రధానిగా, మరొర నరసింహుడు గవర్నర్ గా ఉండేవారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో నరసింహస్వామి అరాధన (Cult of Lord Narasimha) చాలా ఎక్కువ ఉండటమే దీనికి కారణం. ఈ ప్రాంతాల్లో ఉన్న లక్ష్మీనరసింహ ఆలయాలు ఎంత ప్రసిద్ధి చెందాయో అహోబిలం,యాదగిరి గుట్ట ,సింహాచలం,కదిరి, అంతర్వేది, మంగళగిరి లలోని ఆలయాలు సాక్ష్యం.

అయితే, ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అనేది మొదలయింది అహోబిలం ను రాష్ట్రాలనుంచే. ఇది ప్రదేశం తెలుగు వాళ్లు గర్వపడాల్సిన విషయం ఇది. ఒదిశా వాళ్లకు జగన్నాథుడెలాగో తెలుగు వారికి లక్ష్మీ నరసింహస్వామి అంతే. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అహోబిలంలో మొదలై ఇతర ప్రాంతాలకు విస్తరించిందని చరిత్రకారులు చెబుతున్నారు.

నరసింహ స్వామి ఆరాధన ఉత్తర భారతంలో బాగా తక్కువ. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు బాగా అరుదు. కొన్ని చారిత్రక ఆధారాలు (కింది ఫోటో. మథుర. గుప్తుల కాలం) దొరికినా ఉత్తర భారత ప్రజల్లో నరసింహ స్వామి ఆరాధన తక్కువ.

నరసింహ స్వామి ఆరాధనకు సంబంధించి ఆది శంరకాచార్యులు రచించిన కరావలంబ స్తోత్రం ప్రధానమైనది. రామానుజాచార్య కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకుడే. హోయసల రాజు విష్ణువర్ధనుడు అనేక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు నిర్మించేందుకు కారణం ఆయనే నని చెబుతారు. మధ్వాచార్యుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.

చరిత్రకారుల పరిశోధనల ప్రకారం, నరసింహస్వామి (విష్ణుదేవుని దశావతారాల్లోఒకరు) ఆరాధన రాయలసీమలోని అహోబిలం లో మొదలయింది. అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. (కింది ఫోటో కర్నాటక మేల్కోటే , యోగ నరసింహాలయం)

ఈ లెక్కన లక్ష్మీ నరసింహాస్వామి ఆలయాలలో తెలుగు నాట అంత్యంత పురాతనమయినది కర్నూలు జిల్లాలోకి అహోబిలమే. నరసింహస్వామికి సంబంధించిన ప్రముఖమయిన ఆలయాలుండేది తెలంగాణ, ఆంధ్రలోనే. తర్వాతి స్థానం తమిళనాడుది. ఒరిస్సా లో కూడా ఈ సంప్రదాయం కొద్దిగా కనిపిస్తుంది. పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో నరసింహాస్వామి ఆలయం కూడా కనిపిస్తుంది.

దశావతారాలు గుర్తున్నాయా? ఇందులో మొదటి మూడు అవతారాలు (మత్స్య, కూర్మ, వరాహా) జంతువులకు సంబంధించినవి. తర్వాత వచ్చే నరసింహ అవతారం జంతువు-మనిషిల కలయిక. ఇందులో ఒక పరిణామం కనిపించడం లేదూ

పూర్వకాలంలో నాటి తెగల్లో ఉన్న సింహారాధన నుంచి క్రమంగా నరసింహారాధన వచ్చిందని కొందరు చెబుతారు అంటారు. నరసింహస్వామి భార్య చెంచులక్ష్మి. అహోబిలం చెంచు తెగలుండే ప్రాంతం. పై ఆహోబిలం, కింది అహోబిలంల మధ్య ప్రాంతం ఆయన సంచరించిన లీలా స్థలం గా విశ్వసిస్తారు. హిరణ్యకశ్యపుడిని సంహరించాక ఉగ్రనరసింహుడిగా నరసింహస్వామి నల్లమల అడవుల్లో సంచరిస్తున్నపుడు ఆయన ఉగ్రరూపం చూసి దేవతలు భయపడ్డారు. అపుడు లక్ష్మీ దేవిని కలసి, ఆయన కోపం చల్లారేలా చేయాలని కోరారు. అపుడు లక్ష్మీదేవి చెంచుకన్య రూపం ధరించి నల్ల మల అడవుల్లో సంచరిస్తూ నరసింహ స్వామి కంటపడింది. ఆమెనుచూశాక తనని వివాహం చేసుకోవాలని కోరారు. లక్ష్మీదేవి ఆయనకు అనేక పరీక్షలు పెట్టి చివర వివాహమాడేందుకు అంగీకరించింది. ఆమెయే చెంచు లక్ష్మిఅయ్యిందనేది పురాణగాథ. (కింది ఫోటో చోళుల కాలం నాటి పంచలోహ విగ్రహం)

నరసింహస్వామి ఆరాధన మీద బాగా పరిశోధన చేసిన ఎ. ఎస్ మన్ ( Anncharlott Eschmann ) తెలంగాణ, ఆంధ్రప్రాంతంనుంచే నరసింహ ఆరాధన మొదలయిందని వాదిస్తున్నారు. ప్రొఫెసర్ ఎష్మన్ పూరీ జగన్నాథ, నరసింహస్వామి ఆరాధన మీద చాలా పరిశోధన చేశారు.

నరసింహస్వామి ఆరాధన చరిత్ర ప్రకారం గంటూరు జిల్లా కొండమోటు దగ్గిర దొరికిన ఒక పలకం మీద కనిపించిన నరసింహుడి బొమ్మ (కిందిఫోటో) ఈ అవతారానికి సంబంధించిన ఆధారాలలో పురాతనమయింది ఇదే నని చరిత్రకారులు చెబతారు.ఇందులో నరసింహుడి రెండు చేతుల్లో గద , చక్రం ఉంటాయి.ఇది క్రీ.శ3 వశతాబ్దం కాలానిదని, అందులో కూడదా శాతవాహనుల కాలానిదని చెబుతారు.

4-6 శతాబ్దాల కాలంలో గుప్తుల కాలంలో నరసింహారాధన దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. గుప్త చక్రవర్తులలో ఒకరిపేరు నరసింహగుప్త. హిరణ్య కశ్యపుడి కథ లో ఉండే స్థంభం గుప్తుల అనంతర కాలంలో జోడయిందని చెబుతున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం

ప్రొఫెసర్ సువిరా జైస్వాల్ 1973లో హిస్టరీ కాంగ్రెస్ లో సమర్పించిన ఒక పరిశోధనాపత్రం ప్రకారం నరసింహస్వామి ఆరాధన తెలంగాణ, ఆంధ్ర,ఒదిషా,చత్తీష్ గడ్ ప్రాంతాలలోని తెగల నుంచి వచ్చింది. వారి స్థంభారాధన క్రమంగా వైష్ణవ సంప్రదాయంలోకి చొరబడిందని ఆయన అభిప్రాయం. పూరిజగన్నాథ స్వామి కూడా ఆలయం ఒకపుడు నరసింహాలయమే. (కింది ఫోటో పూరీ యజ్ఞ నరసింహ ఆలయం)

అయితే, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలతోపాటు రాజస్తాన్ నుంచి కేరళ దాకా నరసింహస్వామి ఆలయాలున్నా, ఇప్పటికీ నరసింహారాధన ఎక్కువగా ఉన్న ప్రదేశాలు తెలుగు రాష్ట్రాలే. అక్కడి ఆలయాలు అంత ప్రాముఖ్యం లేనివి.

పెద్దవి చిన్నవి కలిపి ఆంధప్రదేశ్ లో మొత్తంగా 350 నరసింహాలయాలున్నాయి. తెలంగాణలో 169 ఆలయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. కొన్ని మైదాన ప్రాంతాలలో ఉంటాయి.

నరసింహస్వామికి సంబంధించిన తెలుగు నాట ఉన్న ప్రఖ్యాత ఆలయాలు:

ఆహోబిలం (కర్నూలు జిల్లా), సింహాచలం(విశాఖపట్టణం జిల్లా), మంగళగిరి (గుంటూరు జిల్లా), మట్టపల్లి(గుంటూరు జిల్లా), కేతవరం (గుంటూరు జిల్లా), వేదాద్రి(కష్ణా జిల్లా), అంతర్వేది(తూర్పుగోదావరి జిలా), సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) మాలకొండ (ప్రకాశం జిల్లా),కోరుకొండ (తూర్పుగోదావరి జిల్లా), ఆగిరిపల్లి (కృష్ణా జిల్లా) కదిరి (అనంతపురం జిల్లా) పెన్నహోబిలం( అనంతపురం జిల్లా), తిరుమల యోగనరసింహ స్వామి (చిత్తూరు జిల్లా) వాడపల్లి (నల్గొండ జిల్లా) యాదగిరి గుట్ట (యాదాద్రి జిల్లా), ధర్మపురి (కరీంనగర్ జిల్లా). ఇవి కాకుండా చిన్న చిన్న ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.