ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.


వచ్చే ఏడాది జనవరి 11 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. గతేడాది ఆగస్టులో మొదలైన ఈ నిషేధం, ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణయంతో సరైన పత్రాలు ఉన్న రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

గత ఏడాది ఆగస్టులో ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం విధించారు. అప్పటి నుంచి ఏడు సార్లు ఈ ఆదేశాలను పొడిగిస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాల వాస్తవాలను, చట్టబద్ధతను పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ విచారణ ఇంకా కొలిక్కి రాకపోవడంతో, నిషేధాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పొడిగింపు వల్ల, తమ వద్ద అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ, భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పంచాయతీలకు అదనపు ఆదాయం

పంచాయతీలకు ఏటా రూ.100 కోట్ల అదనపు ఆదాయం రానుంది. భూ వినియోగ మార్పిడికి విధించే బాహ్య అభివృద్ధి రుసుములు (External Development Charges – EDC) ఇకపై పంచాయతీలకే చెందుతాయి. గతంలో ఈ రుసుములు రెవెన్యూ శాఖకు వెళ్లేవి. అనుమతులు సులభతరం చేయడానికి ప్రభుత్వం ‘నాలా’ (Nala) రద్దు చేయడంతో ఈ మార్పు జరిగింది. ఈ కొత్త ఆదాయం పట్టణాభివృద్ధికి, స్థానిక సంస్థలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పంచాయతీలకు కొత్త ఆదాయ మార్గం ఏర్పడింది. భూమిని ఒక అవసరానికి వాడటం నుండి మరో అవసరానికి మార్చుకునేటప్పుడు ఈ బాహ్య అభివృద్ధి రుసుములు వసూలు చేస్తారు. ఇంతకుముందు ఈ రుసుములు రెవెన్యూ శాఖ పరిధిలో ఉండేవి. అయితే, భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ‘నాలా’ అనే పాత పద్ధతిని రద్దు చేసింది.ఏపీకి మరో పెట్టుబడి

ఏపీ కేంద్రంగా దేశంలోని అతి పెద్ద ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు (పీసీబీ) తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ‘తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో సిగ్మా సీజీఎస్‌ సంస్థ రూ.1,595 కోట్ల పెట్టుబడితో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఈ పరిశ్రమ ద్వారా 2,170 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ పెట్టుబడి వల్ల దేశ వార్షిక ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులు 70 బిలియన్‌ డాలర్లు తగ్గే అవకాశం ఉంది’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఇటు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని పశు సంవర్ధక శాఖ పాలిటెక్నిక్‌ కాలేజీకి నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు రూ.2.22 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇస్తూ పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.