ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో అనధికార నిర్మాణాల క్రమబద్దీకరణ (బీపీఎస్) మరో సారి అమలు చేస్తోంది. ఇందు కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది.
అనధికార నిర్మాణాలు క్రమబద్దీకరించకుకోకుంటే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీపీఎస్ కు సంబంధించి ఫీజులను ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 31 లోగా చేసిన నిర్మాణాలకు ఈ బీపీఎస్ అమలు చేసేలా ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం మరో సారి బీపీఎస్ తీసుకొచ్చింది. అనధికార నిర్మాణాలను క్రమబద్దీకరణకు చివరి అవకాశంగా పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 31కి ముందు నిర్మించిన అన్ని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించుకునే అవకాశం కల్పించారు. ట్యాంకులు, ప్రభుత్వ భూములు, అసైన్డ్, సీలింగ్ భూముల్లో చేసిన నిర్మాణాలు మినహా మిగిలిన వాటిని ఈ ఉత్తర్వుల ప్రకారం క్రమబద్దీకరించుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనల విడుదల అనంతరం 2019లో విడుదల చేసిన అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ చట్టం రద్దవుతుందని జిఓలో పేర్కొన్నారు. సిఆర్డిఏ పరిధిలోని రాజధాని ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాలకు తాజా జిఓ వర్తిస్తుందని తెలిపారు. నోటిఫికేషన్ వచ్చిన 120 రోజుల్లోపు క్రమబద్దీకరణకోసం దరఖాస్తు చేసుకోవాలని లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, అవసమైతే కూలివేస్తామని పేర్కొన్నారు.
కాగా, దరఖాస్తుతోపాటు రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న తరువాత ఎల్టిపి, ఇతర అధికారులు పరిశీలించి దృవీకరణ సర్టిఫికెట్ ఇస్తే క్రమబద్దీకరణ జరుగుతుందని, దాన్నే అక్యుపెన్సీ సర్టిఫికెట్గానూ పరిగణిస్తామని తెలిపారు. ఇక, సబ్ రిజిస్ట్రార్ ధృవీకరించిన అక్రమ నిర్మాణ మార్కెట్ విలువ గజం రూ.50 వేలు ఉంటే అటువంటి చోట్ల 100 శాతం జరిమానా విధిస్తారు. రూ.25 వేల నుండి రూ.50 వేలలోపు ఉంటే 90 శాతం, 10 వేల నుండి రూ.25 వేలలోపు ఉంటే 80శాతం, ఐదువేల నుండి పదివేల లోపు ఉంటే 70 శాతం, వెయ్యి నుండి ఐదువేలలోపు ఉంటే 60 శాతం, రూ.1000 వరకూ ఉంటే 50 శాతం జరిమానాగా విధిస్తారు . రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు భూమి డాక్యుమెంటు, ఈసి, ప్లాను, భవన ఫోటోలు, ఉల్లంఘించిన ప్రాంతానికి సంబంధించిన ప్లాను, మొత్తం నిర్మాణ ప్రాంతం, రోడ్లు విస్తరణ ఉంటే దానికి సంబంధించిన ప్లాను, ఎల్టిపి జారీచేసిన స్టెబిలిటీ సర్టిఫికెట్‌ను జత చేయాలని సూచించారు.
అదే విధంగా 18 మీటర్ల కంటే ఎత్తున్న నివాస భవనాలు, 15 మీటర్ల కంటే ఎత్తున్న వాణిజ్య భవనాలు, 500 చదరపు మీటర్ల అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పాఠశాలలు, సినిమాహాల్లు, ఫంక్షన్ హాళ్లు వంటి వాటికి అగ్నిమాపక శాఖ నుండి అనుమతి పత్రం కూడా సమర్పించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా నిర్మించిన ఫ్లోర్‌కు సంబంధించి మొత్తం నిర్మాణానికి జరిమానా విధించనున్నారు. అనధికార లేఅవుట్లలో కట్టిన భవనాలను కూడా క్రమద్దీకరించాలని నిర్ణయించారు. 1997కు ముందు నిర్మించిన భవన అయితే 25 శాతం జరినామా తగ్గిస్తామని, ఇందు కోసం ఇంటి పన్ను దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. గుర్తించిన మురికివాడల్లో ఉన్న భవనాలకు 50 శాతం మాత్రమే జరిమానా విధించనున్నట్లు వివరించారు.
































