సాధారణంగా ఆంధ్ర వంటలలో గోంగూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా గోంగూర అడిగే వాడే తెలుగోడు అని కూడా అంటుంటారు. గోంగూరలో ఉన్న పులుపు రుచికి ఏ ఇతర ఆకుకూరతో పోల్చలేము. ఇది సహజమైన విటమిన్ C, ఐరన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అందుకే, గోంగూర వంటకాలు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. గోంగూరతో చేసిన వంటకం జీర్ణక్రియకు సహకరిస్తుంది, వేడి తక్కువగా ఉండేలా చేస్తుంది, అలాగే రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
కాగా గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు ఇలాంటివి మనకు తెలిసిందే, కానీ గోంగూర కోడిగుడ్డు కూర రుచి చూసినవారు మాత్రం దాని ఘుమఘుమ వాసనను మరిచిపోలేరు. అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో చేసే ఈ కూర టేస్టులో కూడా బెస్ట్ గా ఉంటుంది. అందుకే ఈ టేస్టీ టేస్టీ గోంగూర కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..
కావాల్సిన పదార్థాలు (4 మందికి సరిపడా): కోడిగుడ్లు – 4 గోంగూర ఆకులు – 1 పెద్ద కప్పు (తాజాగా తుంచినవి) టమాటాలు – 2 (ముక్కలుగా) ఉల్లిపాయ తరుగు – 4 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి – 3 లేదా 4 (చీలికలు పెట్టినవి) నూనె – తగినంత జీలకర్ర – 1 టీస్పూన్ వెల్లుల్లి రెబ్బలు – 10 (ముద్దగా కొట్టినవి) ఎండుమిర్చి – 3 లేదా 4 (ముక్కలుగా తుంచినవి) కరివేపాకు – కొద్దిగా ఉప్పు – రుచికి సరిపడా పసుపు – కొద్దిగా కారం పొడి – రుచికి తగినంత గరం మసాలా – 1 టీస్పూన్ కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూన్ తయారీ విధానం..
గుడ్లు ఉడికించడం: ముందుగా కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికాక చల్లబరచి పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. గుడ్లపై కత్తితో చిన్న చీలికలు పెడితే, కూరలో మసాలా బాగా చొరబడుతుంది.
గోంగూరను మగ్గించడం..
ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక గోంగూర ఆకులు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి వేయాలి. ఇవి మగ్గేంతవరకు తక్కువ మంటపై మూతపెట్టి ఉంచాలి. నీళ్లు అవసరమైతే ఒక స్పూన్ నీరు చల్లండి. మగ్గాక చల్లారనివ్వాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తయారీ.. గోంగూరను మగ్గించిన అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించాలి. వాసన వచ్చిన తర్వాత కరివేపాకు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. ఆ మసాలాలో ఉడికించిన గుడ్లు వేసి ఒక నిమిషం ఫ్రై చేయాలి, దాంతో గుడ్లపై మసాలా పట్టి రుచిగా మారుతుంది. ఇప్పుడు మిక్సీ చేసిన గోంగూర పేస్ట్‌ను పాన్‌లో వేసి, గ్రేవీకి సరిపడా నీరు పోసి బాగా కలపాలి.
మధ్యస్థ మంటపై 6-7 నిమిషాలు మగ్గనివ్వాలి. కూర మగ్గి, నూనె పైకి తేలే సమయానికి వంట సిద్ధమవుతుంది. చివరగా గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేస్తే వాసనతో ఊరించే “గోంగూర కోడిగుడ్డు కూర” రెడీ! ఇక వేడి వేడి అన్నం, రాగి సంగటి, రోటీ లేదా చపాతీతో ఈ కూర అద్భుతంగా ఉంటుంది. కాస్త నిమ్మరసం పిండి తింటే పులుపు-కారం కలయిక మరింత రుచిగా ఉంటుంది. సైడ్‌లో ఉల్లిపాయ, పెరుగు ఉంటే పూర్తి ఆంధ్ర భోజనం అనిపిస్తుంది. అయితే గోంగూర ఎక్కువ పులుపుగా ఉంటే, టమాటాల పరిమాణం పెంచి బ్యాలెన్స్ చేయండి. పులుపు తక్కువ కావాలంటే, గోంగూర మగ్గేటప్పుడు కొద్దిగా పప్పు కూడా కలపవచ్చు. కూరలో చిటికెడు చింతపండు రసం కలిపితే, పాతకాలపు “రాయలసీమ టచ్” వస్తుంది. గుడ్లను వేయించే ముందు చిటికెడు ఉప్పు చల్లి ఫ్రై చేస్తే రుచిలో తేడా తెలుస్తుంది.






























