పాలు సేకరించాల్సిన పనే లేదు

చిన్న సంస్థైనా సరే.. విక్రయదారు నాణ్యమైన సరకులు సరఫరా చేసేలా  నిబంధనలను మరింత కఠినతరం చేస్తుందే తప్ప నాణ్యత విషయంలో రాజీపడేలా వాటిని సడలించదు. అలాంటిది ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో లడ్డూ సహా వివిధ రకాల ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యత కోణంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ వైకాపా హయాంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, అప్పటి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి మాత్రం ఇవేవీ పట్టించుకున్నట్లు లేదు. తమ సొంత ఎజెండా కోసం నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలను అడ్డగోలుగా, ఇష్టానుసారంగా మార్చేసింది. ఓ కమిటీని నియమించుకుని తమకు కావాల్సినట్లుగా సిఫార్సులు చేయించుకుని వాటికి ఆమోదం తెలిపేసింది. వైవీ సుబ్బారెడ్డి నిర్వాకంతో అసలు పాలు, వెన్న సేకరణే చేయని, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేని సంస్థలకు నెయ్యి టెండర్లలో పాల్గొనే అవకాశం కలిగింది. దీంతో మారిన నిబంధనలను అడ్డం పెట్టుకుని కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు ఇష్టానుసారంగా చెలరేగిపోయాయి.


నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?

తితిదేకు నెయ్యి సరఫరాకు కఠిన అర్హతలు, నిబంధనలు మొదటి నుంచీ ఉన్నాయి. ఎప్పుడూ కల్తీ నెయ్యి సరఫరా జరిగిన ఉదంతమే లేదు. అయితే వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెయ్యి సరఫరా టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలు సవరించాలని, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని 2019 డిసెంబరు 28న జరిగిన తితిదే బోర్డు సమావేశంలో తీర్మానించారు. టెండరు నిబంధనలను సవరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 2020 మే 23న సమావేశమైన ఈ కమిటీ అప్పటి వరకూ ఉన్న కీలక షరతుల్లో కొన్నింటిని తొలగిస్తూ, మరికొన్నింటిని మారుస్తూ సిఫార్సులు చేసింది.  అప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి స్వార్థం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? నాటి ప్రభుత్వం పాలక వర్గం నిర్ణయాన్ని ఎందుకు ఆపలేదు అనేవి ఇప్పుడు సమాధానం వెతకాల్సిన ప్రశ్నలు.

పాలు సేకరించి ఉండాలనే నిబంధనే ఎత్తేశారు

  • తితిదే నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే సంస్థలకు (జాతీయ డెయిరీలు) మూడేళ్లుగా డెయిరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలనే నిబంధనను మార్చేసి ఏడాదిగా డెయిరీ నిర్వహిస్తుంటే చాలని సరిపెట్టేశారు.
  • డెయిరీ గతేడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవుపాలు సేకరించి ఉండాలని, దీనికి ఆధారంగా ప్రొక్యూర్‌మెంట్‌ రికార్డులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సమర్పించిన రిటర్న్‌లు జత చేయాలనే నిబంధనను గల్లంతు చేసేశారు. ఆయా సంస్థలు మార్కెట్‌ అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధనను ఎత్తేశారు. పాలు సేకరించకుండా, వెన్న తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందనే ఇంగితమైనా వారికి లేకుండా పోయింది.
  • సంస్థల వార్షిక టర్నోవర్‌ 3 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాదన్నా రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధన తీసేసి, రూ.150 కోట్ల టర్నోవర్‌ ఉంటే చాలని మార్చేశారు. ఆయా సంస్థలు మూడేళ్ల పాటు రోజుకు 12 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధననూ తొలగించి ఏడాదిపాటు రోజుకు 8 టన్నుల వెన్న సేకరణ, ఉత్పత్తి సామర్థ్యం ఉంటే చాలని సరిపెట్టేశారు.
  • ఇలా నిబంధనలన్నీ సడలించటంతోనే భోలేబాబా, వైష్ణవి డెయిరీ వంటి సంస్థలు రంగప్రవేశం చేయటానికి అవకాశం కలిగింది. అసలు పాలతో కాకుండా పామాయిల్, పామ్‌ కర్నెల్‌ ఆయిల్, తయారు చేసిన నెయ్యే కాని నెయ్యిని సరఫరా చేశాయి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.