తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. నేటి నుంచి మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రత మెుదైలంది. అడుగు తీసి బయటపెట్టాలంటే వణుకు పుడుతుంది. నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి

తెలంగాణ ఈసారి అత్యంత చలి తీవ్రత ఎదుర్కోనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలలో తగ్గుదల గురించి వెల్లడించింది. ఈ సీజన్‌లో తీవ్రమైన చలి ఉంటుందని వెల్లడించింది. వాతావరణ పరిశీలకులు నవంబర్ 13 నుంచి 18 మధ్య గరిష్ట చలిగాలుల గురించి హెచ్చరిస్తున్నారు.


బుధవారం రాష్ట్రంలోని సిర్పూర్ (కుమురం భీమ్) వద్ద 10.2 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ 11.1 డిగ్రీల వద్ద ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TGDPS) ప్రకారం, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల 11 డిగ్రీల నుంచి 12డిగ్రీల మధ్య నమోదయ్యాయి. సాధారణ సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా పడిపోయాయి ఉష్ణోగ్రతలు.

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్య ఉన్నాయి. శేరిలింగంపల్లిలో 13.2డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 14.8 డిగ్రీలు ఉన్నాయి. ఉత్తరాది నుండి కొనసాగుతున్న పొడి గాలులు, స్పష్టమైన ఆకాశం రాత్రిపూట వేగంగా చల్లబడటానికి కారణమవుతున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

‘తేమ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఉపరితల ఉష్ణోగ్రతలు త్వరగా తగ్గుతాయి.’ అని ఐఎండీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

గురువారం నుండి గరిష్ట చలిగాలులు ప్రారంభమవుతాయని, ఉత్తర, పశ్చిమ, మధ్య జిల్లాలను ప్రభావితం చేస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. ఇక్కడ ‘కనిష్ట ఉష్ణోగ్రతలు 8–10 డిగ్రీలకి పడిపోవచ్చు. హైదరాబాద్‌లో నవంబర్ 13 నుంచి 18 మధ్య పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో 11 డిగ్రీల నుంచి 13 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా.’ అని వెల్లడించారు.

పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తెల్లవారుజామున బయటకు రాకుండా ఉండాలి. రాత్రిపూట ఎక్కువగా బయట తిరగకూడదు. మందమైన దుస్తులు ధరించాలి. రైతులు రబీ పంటలను, పశువులను చలి నుండి రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. ఐఎండీ ప్రకారం నవంబర్ 17 వరకు చలి తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.