బెస్ట్ వెయిట్ లాస్ డైట్.. రాగి సూప్.. 10 నిమిషాల్లోనే ఇలా చేసుకోండి..

రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మిల్లెట్స్ రకానికి చెందినవి. ముఖ్యంగా రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే రాగుల్ని రకరకాలుగా తీసుకుంటారు. కొందరు రాగి జావ చేసుకుంటారు. మరికొందరు రాగి మాల్ట్ పౌడర్ తయారు చేసుకుంటారు. ఇంకొందరు రాగులతో స్వీట్స్ తయారు చేసుకుంటారు. అలాగే రాగులతో ముద్దలు, కుడుములు చేసుకుంటారు. అధిక బరువుతో బాధపడేవాళ్లు రాగులను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


అయితే రాగులతో టేస్టీగా ఉండే రాగి సూప్ తయారు చేసుకుని తాగితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చల్లని కాలంలో ఈ వేడి వేడి రాగి సూప్ ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తాగొచ్చు. మరి ఈ హెల్దీ రాగి సూప్‌ ను ఎలా తయారు చేయాలి..? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.. రాగి పిండి తగినంత, టమాటాలు రెండు, ఉల్లిపాయలు రెండు, బీన్స్, క్యారెట్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం, నెయ్యి లేదా ఆయిల్ తీసుకోవాలి..

తయారీ విధానం చూస్తే.. ముందుగా ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. అందులో జీలకర్ర, తరిగి పెట్టుకున్న సన్నని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ నెక్ట్స్ ఉల్లి పాయలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారాక.. క్యారెట్, బీన్స్ వేసి ఐదారు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఉప్పు వేశాక.. సరిపడా నీళ్లు పోసి మరో ఐదు నిమిషాల పాట మరిగించుకోవాలి.

అది మరిగేలోపు చిన్న గిన్నెలో రాగి పిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి స్పూన్​తో ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. స్టవ్ మీద మరుగుతున్న ఆ మిశ్రమంలో ముందుగా రెడీ చేసుకున్న రాగి పిండి పేస్టును వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ లో మరో మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని మరిగించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో మిరియాల పొడి, కొత్తి మీర తరుగు వేసి కలుపుకోవాలి. దాంట్లో నిమ్మరసం పిండుకుని సర్వింగ్ చేసుకోవడమే. వేడి వేడి రాగి సూప్ రెడీ అయినట్లే..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.