వ్యాధి రావడానికి ముందే దానికి సంబంధించిన పలు సూచనలు శరీరానికి ఇస్తుందని వైద్య నిపుణులు. ఆ సూచనలను పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరిస్తు్న్నారు.
చర్మంపై నిరంతర దురద రావడం అనేది ఏ వ్యాధికి సంకేతం అనేది మీలో ఎంత మందికి తెలుసు. మూత్రపిండాల వ్యాధి సంభవించినప్పుడు, దాని లక్షణాలు చర్మంపై కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. వాస్తవానికి మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇవి రోజుకు 24 గంటలు పనిచేస్తాయి. అవి రక్తం, వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, సరిగ్గా పని చేయలేనప్పుడు, శరీరంలో వ్యర్థాలు, ద్రవాలు పేరుకుపోతాయని హెచ్చరిస్తున్నారు.
పలువురు వైద్యులు మాట్లాడుతూ.. అలసట, బలహీనత, వాపు (ముఖ్యంగా ముఖం, కాళ్ళలో), నురుగు లేదా రక్తంతో కూడిన మూత్రం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన మూత్రపిండాల వ్యాధి రాబోతుంది అనే దానికి సాధారణ సంకేతాలు అని చెబుతున్నారు. ఈ వ్యాధి అనేది శరీరంలో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని, ఇది అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి ముందుగానే చికిత్స చేయించుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. ఈ వ్యాధికి డయాబెటిస్, అధిక రక్తపోటు అత్యంత సాధారణ కారణాలు అని వైద్యులు పేర్కొన్నారు.
నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నివేదికల ప్రకారం.. మూత్రపిండాలు శరీరం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాలను తొలగిస్తాయని వెల్లడించాయి. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడతాయని, ఎముకలను బలంగా ఉంచుతాయని, అలాగే రక్తంలో సరైన మొత్తంలో ఖనిజాలు ఉండేలా చూస్తాయని పేర్కొన్నారు. చర్మం పొడిబారడం, దురద అనేది ఖనిజ, ఎముక వ్యాధికి సంకేతం కావచ్చు అని చెబుతున్నారు. ఇది తరచుగా అధునాతన మూత్రపిండ వ్యాధితో పాటు వస్తుందని, లేదా మూత్రపిండాలు రక్తంలో ఖనిజాలు పోషకాల సరైన సమతుల్యతను కాపాడుకోలేనప్పుడు సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు.
మూత్రపిండాలు వ్యర్థాలను, ద్రవాలను సరిగ్గా తొలగించలేనప్పుడు, శరీరంలో అదనపు ద్రవం పేరుకుపోతుంది. ముఖ్యంగా ముఖం (కళ్ళ చుట్టూ), పాదాలు, చీలమండలు, చేతుల్లో వాపు సంభవించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయని, ఇది కామెర్లుకు సంకేతం అని హెచ్చరించారు. మూత్రపిండాల వ్యాధి కూడా రక్తహీనతకు కారణమవుతుందని, దీనివల్ల చర్మం పసుపు రంగులోకి మారవచ్చని సూచించారు. మూత్రపిండాల వ్యాధి ఉంటే, చర్మంపై చాలా దురద వస్తుందని, దీని వలన చర్మంపై మచ్చలు లేదా దద్దుర్లు ఏర్పడుతాయని చెబుతున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

































