పాకిస్తాన్ చేతిలో ఇండియా ఘోర పరాజయం

 ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్ల మధ్య ఆరో మ్యాచ్‌లో పాక్ సంచలనం సృష్టించింది. ఇండియా-ఏ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది.


ఖతార్ రాజధాని దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు కేవలం 19వ ఓవర్‌లోనే 136 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని పాకిస్తాన్-ఏ 14వ ఓవర్‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా ఛేదించింది. ఈ విజయంతో పాకిస్తాన్-ఏ సెమీ-ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లోనే 136 పరుగులకే పరిమితమైంది. ప్రియాన్ష్ ఆర్య (10) త్వరగా ఔటైనా.. వైభవ్ సూర్యవంశీకి నమన్ ధీర్ జత కలిశాడు. వీరిద్దరూ సులువుగా పరుగులు రాబట్టారు. బ్యాటింగ్ పవర్‌ప్లేలో ఇండియా-ఏ 50 పరుగులు చేసింది. నమన్ ధీర్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి సాద్ మసూద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. వైభవ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి సూఫియాన్ ముఖీల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

సూర్యవంశీ అవుటయ్యాక ఇండియా-ఏ పతనం మొదలైంది. కెప్టెన్ జితేష్ శర్మ(5), నెహాల్ వధేరా(8), ఆశుతోష్ శర్మ(0) వంటి కీలక ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు.చివరి ఏడు వికెట్లకు కేవలం 35 పరుగులే జోడించడంతో జట్టు 136 పరుగులకు ఆలౌట్ అయింది. హర్ష్ దూబే 19 పరుగులు చేశాడు. పాకిస్తాన్-ఏ తరఫున షాహిద్ అజీజ్ 3 వికెట్లు తీయగా, మాజ్ సాదఖత్, సాద్ మసూద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

పాకిస్తాన్-ఏ మెరుపు ఛేదన

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్-ఏ ఓపెనర్ మాజ్ సాదఖత్ అద్భుతంగా రాణించాడు. మాజ్ సాదఖత్, మహ్మద్ నయీమ్ (14) కలిసి తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాకిస్తాన్-ఏ బ్యాటింగ్ పవర్‌ప్లేలో 57 పరుగులు చేసింది. భారత బౌలర్లలో 7వ ఓవర్‌లో నమన్ ధీర్ ఏకంగా 20 పరుగులు ఇచ్చేశాడు. మాజ్ సాదఖత్ కేవలం 31 బంతుల్లోనే తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మాజ్ సాదఖత్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మహ్మద్ ఫైక్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో పాకిస్తాన్-ఏ 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

భారత బౌలర్ల పొరపాట్లు

భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వారు ఏకంగా 17 అదనపు పరుగులు ఇవ్వగా.. పాకిస్తాన్-ఏ బౌలర్లు ఒక్క అదనపు పరుగు కూడా ఇవ్వలేదు. భారత్ తరఫున యశ్ ఠాకూర్, సుయాష్ శర్మలకు చెరో వికెట్ లభించింది.

సెమీస్‌లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్-ఏ

ఇండియా-ఏపై విజయం సాధించడంతో పాకిస్తాన్-ఏ జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో సెమీస్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఇండియా-ఏ జట్టు టోర్నమెంట్‌లో నిలబడాలంటే తమ తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాలి.గ్రూప్-బి నుంచి రెండో సెమీ-ఫైనల్ స్థానం కోసం ప్రస్తుతం మూడు జట్లు పోటీపడుతున్నాయి. అవి ఇండియా-ఏ, ఒమన్, యూఏఈ. ఇండియా-ఏ జట్టు నవంబర్ 18న ఒమన్‌తో కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సెమీ-ఫైనల్స్‌కు చేరుకోవాలంటే ఇండియా-ఏకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ ఫలితం, అలాగే యూఏఈ ప్రదర్శన గ్రూప్-బి నుంచి రెండో అర్హత పొందే జట్టును నిర్ణయిస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.