ఆహార అవసరాలను తీర్చడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న ఆక్వా కల్చర్ సాగు ప్రోత్సాహం దిశగా జిల్లా యంత్రాంగం ఆలోచిస్తోంది. జిల్లాలో 15 వరకు సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వీటి వద్ద వచ్చే ఊటతో చాలా వరకు పొలాలు వృథాగా మారాయి. సాగు చేసిన పంటలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి దశలో పది వేల ఎకరాల్లో ఆక్వా సాగుకు చర్యలు తీసుకోవాలని ప్రణాళిక రచిస్తోంది.
ఇటు ఉద్యానం.. అటు ఆక్వా
ఎంపిక చేసిన రైతులతో వివిధ పథకాల కింద ఆక్వా సాగు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. సాగులో శిక్షణ, నరేగా ద్వారా చేపల చెరువుల తవ్వకాలకు అవకాశం, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తద్వారా రైతులకు తోడ్పాటు ఇవ్వడంతో పాటు వృద్ధి రేటు సాధనకు కృషి చేయెచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉద్యాన రంగంపై దృష్టి పెట్టిన జిల్లా యంత్రాంగం.. ఆ తర్వాత ఆక్వారంగానికి ప్రాధాన్యమివ్వాలని సంకల్పించింది.
రైతులకు ఒనగూరనున్న లబ్ధి
ఆక్వాలో చిన్న స్థలంలోనే అధిక దిగుబడినిచ్చే ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. చేపలు, రొయ్యలకు స్థిరమైన ధర లభిస్తోంది. ఆహారపు అలవాట్లలోనూ ప్రజలు వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలోనూ ఆక్వాకల్చర్ పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో రైతులను ఆ దిశగా ప్రోత్సహించడం ద్వారా లబ్ధి పొందేలా చేయొచ్చని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందుకుగాను ఆయా ప్రాంతాల్లోని వృథా భూములు, ఊట సమస్యతో నిరుపయోగంగా ఉన్న పొలాలను ఎంపిక చేయనున్నారు.
































