మన శారీరక ఆరోగ్యానికి పండ్లు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం అల్పాహారంగా పండ్లు తీసుకుంటే.. రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది. చాలా మంది స్మూతీలు, షేక్స్ లేదా సలాడ్ల రూపంలో పండ్లను తీసుకుంటారు.
అయితే ఉదయం పూట ఏ పండు ఉత్తమం అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంది. జామపండు మంచిదా..? లేదా అరటిపండు మంచిదా? వాటి ఆరోగ్య ప్రయోజనాలు, ఎప్పుడు ఏది ఎంచుకోవాలో తెలుసుకుందాం..
జామపండు: విటమిన్ సి పవర్‌హౌస్
జామపండును ఒక సూపర్ ఫుడ్. 100 గ్రాముల జామపండులో ఏకంగా 228 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలోని వాపుతో పోరాడుతుంది. కేవలం 68 కేలరీలు మాత్రమే ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇందులో 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలోని పొటాషియం రక్తపోటు నియంత్రణకు దోహదపడుతుంది.
అరటిపండు: తక్షణ శక్తికి మారుపేరు
అరటిపండులో వేగంగా శక్తిని ఇచ్చే లక్షణాలు ఉన్నాయి. 100 గ్రాముల అరటిపండులో 89 కేలరీలు ఉంటాయి. దీనిలోని సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఉదయం జిమ్‌కి వెళ్లే ముందు లేదా వ్యాయామం చేసే ముందు దీన్ని తినడం చాలా మంచిది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు అత్యంత అవసరం. దీనిలోని విటమిన్ బి6 మెదడు ఆరోగ్యానికి మంచిది. మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
ఏది మంచిది..?
పరిశోధనల ప్రకారం.. జామపండులో శోథ నిరోధక, రక్తపోటు తగ్గించే, స్థూలకాయ నిరోధక, మధుమేహ నిరోధక లక్షణాలు ఉన్నాయి. అరటిపండు కూడా కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. కాబట్టి రెండు పండ్లూ వాటి స్వంత విధంగా ఆరోగ్యానికి అద్భుతమైనవే.
మీ లక్ష్యాన్ని బట్టి ఎంపిక
జామపండు: మీరు ఉదయం కడుపు నిండిన అనుభూతి చెందాలనుకుంటే, మంచి జీర్ణక్రియ, బరువు తగ్గడం వంటి వాటికి జామపండు ఉత్తమమైనది.
అరటిపండు: మీరు ఉదయం చురుకుగా ఉండాలి, తక్షణ శక్తి, వ్యాయామం వంటి వాటికి అరటిపండు ఒక తెలివైన ఎంపిక. మంచి ఆరోగ్యానికి రెండు సమతుల్యంగా తీసుకోవడం కూడా చాలా మంచిది.
































