ముంచుకొస్తున్న అల్పపీడనంతో ఏపీకి వాన గండం.. తెలంగాణలో చలి పంజా

ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు చలి గజగజా వణికిస్తుంటే..మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా మంగళవారం ఉదయం నుంచి తిరుమల, తిరుచానూరులో భారీ వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నవంబరు 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా నాలుగు రోజులు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కూడా దాటడం లేదు. అల్లూరి జిల్లా మినుములూరులో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 7.3, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పాడేరులో ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతున్నాయి. ఇటు.. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. భారతదేశం అంతటా చలిగాలులు, వర్షపాతం హెచ్చరికలను జారీ చేసింది ఐఎండీ. నవంబర్ 18 నుంచి 20 తేదీల మధ్య పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, విదర్భలోని కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్‌లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కొమురం భీమ్, నిర్మల్ జిల్లాలతో సహా మరో ఐదు జిల్లాల్లో నవంబర్ 18న తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. సంగారెడ్డి, కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ, వరంగల్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, మెదక్‌, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్‌లో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.