శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. పెరుగుతున్న రద్దీ వేళ హైకోర్టు తాజా ఆదేశాల తో కేరళ ప్రభుత్వం – ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు పలు కీలక నిర్ణయాలను ప్రకటించాయి.
ఇక నుంచి శబరిమల దర్శనానికి వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి. పాస్ లేకుండా నీలక్కల్ నుండి శబరిమలకు ప్రవేశం ఉండదు. ఆన్‌లైన్‌లో పాస్‌ను సబ్ఫిట్ చేసుకోవడం తప్పనిసరి అని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్చువల్ క్యూ ద్వారా 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యాలు.. భద్రత పైన కేరళ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు తో కలిసి తాజా నిబంధనలు ఖరారు చేసింది. ఇక నుంచి శబరిమల స్పాట్ బుకింగ్స్ ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. దీంతో 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అదే సమయం లో …ఇక నుంచి ఇక అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులను తప్పనిసరి చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ ద్వారా కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు లోపాలపై కేరళ హైకోర్టు సీరియస్ అయింది. కీలక ఆదేశాలు జారీ చేసింది.
అందులో భాగంగా నవంబర్ 24 వరకు రోజుకు 5,000 స్పాట్ బుకింగ్‌లను మాత్రమే అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ పరిమితితో ప్రతిరోజూ గరిష్టంగా 75,000 మంది యాత్రికులకు మాత్రమే ఆలయంలో దర్శనం చేసుకోగలరు. గతంలో బోర్డు రోజుకు 90,000 మంది యాత్రికుల ను అనుమతించాలని నిర్ణయించింది. ఇందులో 20,000 మందిని స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం చేసుకోవడానికి అనుమతించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న వేళ రద్దీ నియంత్రణ చర్యల పైన ప్రధానంగా న్యాయస్థానం సూచనలు చేసింది. సన్నిధానం ఫ్లైఓవర్ వెంబడి పొడవైన క్యూలు, సౌకర్యాల కొరత, తాగునీరు లేకపోవడం గురించి వివరించే రెండు దేవస్వం బోర్డు పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.





























