కల్తీ నిర్ధారణైనా.. వాళ్లను ఎందుకు కొనసాగించారు?

‘తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్, వైష్ణవి డెయిరీ, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిళ్లు కలిసి ఉన్నాయని, అది కల్తీనెయ్యి అని మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నిర్ధారించిన తర్వాత కూడా.. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైష్ణవి డెయిరీలను 2024 వరకూ, భోలేబాబాను 2022 అక్టోబరు వరకూ నెయ్యి సరఫరాదారులుగా ఎందుకు కొనసాగించారు? కల్తీనెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా వారెవరిపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీపై ఎవరి ఒత్తిడి ఉంది? కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తితిదే ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రహ్మణ్యం మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకు స్పందించలేదు?’ అంటూ వైకాపా హయాంలో తితిదే ఛైర్మన్‌గా  పనిచేసిన జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డిపై సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్‌ పాలనలో తిరుమల లడ్డూ, ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నమోదైన కేసులో గురువారం ఆయన్ను విచారించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన సిట్‌ బృందం… ఉదయం 11 నుంచి రాత్రి పదిన్నర వరకూ ప్రశ్నిస్తూనే ఉంది. వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధమే లేని సంస్థలూ టెండర్లలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించేలా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని అడిగింది. తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి దగ్గర అప్పట్లో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చిన్నప్పన్న ఇచ్చిన వాంగ్మూలాలు, విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టింది. అత్యధిక శాతం ప్రశ్నలకు.. ఆయన తనకు సంబంధం లేదని, టెండర్లు ఆహ్వానించడం, ఖరారు చేయడం వంటివన్నీ అప్పటి అధికారులే చూసుకున్నారని, ఏవైనా ఉంటే వారినే అడగాలంటూ జవాబులిచ్చినట్లు తెలిసింది. సుబ్బారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న సిట్‌ అధికారులు ఆయన్ను మరోసారి విచారించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివి.


కీలక నిబంధనల్ని ఎందుకు ఎత్తేశారు?

  • తితిదే నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే సంస్థలకు (జాతీయ డెయిరీలు) మూడేళ్లుగా డెయిరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలనే నిబంధనను మార్చేసి ఏడాదిగా డెయిరీ నిర్వహిస్తుంటే చాలని ఎందుకు సరిపెట్టేశారు? సంబంధిత డెయిరీ గతేడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవుపాలు సేకరించి ఉండాలని, ఇందుకు ఆధారంగా ప్రొక్యూర్‌మెంట్‌ రికార్డులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సమర్పించిన రిటర్న్‌లు జతచేయాలనే నిబంధనను ఎందుకు గల్లంతు చేసేశారు. ఆయా సంస్థలు మార్కెట్‌ అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధనను ఎందుకు ఎత్తేశారు? పాలు సేకరించకుండా, వెన్న తయారుచేయకుండా నెయ్యి ఉత్పత్తి సాధ్యం కాదనే సంగతి మీకు తెలీదా? అని సుబ్బారెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించగా.. అవన్నీ సంబంధిత అధికారులు, నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాలని, వాటిలో తాను జోక్యం చేసుకోలేదని ఆయన సమాధానమిచ్చినట్లు తెలిసింది.
  • నెయ్యి టెండరు నిబంధనలను మార్చడానికి కారణమేంటని అడగ్గా సాంకేతిక కమిటీ, ప్రొక్యూర్‌మెంట్‌ అధికారులు దీన్ని చూసుకున్నారని, తనకు ప్రమేయమేమీ లేదని సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు.
  • మీ పీఏ చిన్నప్పన్న లంచం అడిగారని ఫిర్యాదుచేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?

    • ‘2022 మే నెలలో జాతీయ డెయిరీల నుంచి 24.50 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు తితిదే టెండర్లు పిలిచింది. అప్పట్లో మీ పీఏ చిన్నప్పన్న భోలేబాబా డెయిరీ ప్రతినిధులను కిలోకు రూ.25 చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇది మీ ప్రమేయంతోనే జరిగిందా?’ అని సిట్‌ అధికారులు అడగ్గా.. కానేకాదని సుబ్బారెడ్డి జవాబిచ్చినట్లు సమాచారం.
    • ‘భోలేబాబా ప్రతినిధులు లంచమివ్వడానికి అంగీకరించకపోవటంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి సాంకేతిక కారణాలతో ఆ సంస్థను పోటీనుంచి తప్పించి ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టినట్లు మా దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో చిన్నప్పన్నకు రూ.50 లక్షలు లంచం సొమ్ము చేరినట్లు మా దర్యాప్తులో వెల్లడైంది’ అని సిట్‌ అధికారులు ప్రశ్నించగా… అవేవీ తనకు గుర్తులేవని సుబ్బారెడ్డి చెప్పినట్లు సమాచారం.
    • చిన్నప్పన్న కిలోకు రూ.25 చొప్పున లంచం అడుగుతున్నాడని భోలోబాబా ప్రతినిధులు మీకు ఫిర్యాదుచేసినా చిన్నప్పన్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగ్గా తనకు అవేవీ గుర్తులేవని సుబ్బారెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం.
    • ‘అప్పట్లో మీ పీఏగా పనిచేసిన చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో 2019-2024 మధ్య రూ.4.69 కోట్లు జమైంది. అందులో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లింది. వాటితో మీకు సంబంధం ఏంటి? ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని మా దర్యాప్తులో తేలింది. ఆ ఆర్థిక లావాదేవీలతో మీకు సంబంధమేంటి?’ అని సిట్‌ అధికారులు అడగ్గా తనకు సంబంధం లేదని సమాధానమిచ్చినట్లు తెలిసింది.
    • వైవీ సుబ్బారెడ్డి నివాసంలోనే విచారణ

      ఈ నెల 13న తిరుపతిలోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వైవీ సుబ్బారెడ్డికి దర్యాప్తు అధికారులు తొలుత నోటీసులిచ్చారు. లఖ్‌నవూలో సమావేశమున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు తాను రాలేనని సుబ్బారెడ్డి సమాధానమిచ్చారు. అనారోగ్య కారణాల రీత్యా హైదరాబాద్‌లో తన నివాసంలోనే ప్రశ్నించాలని విన్నవించారు. దీంతో సిట్‌ బృందం గురువారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లి.. ఆయన్ను విచారించింది.

      గతేడాది సెప్టెంబరులో తితిదే ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదుచేయగా తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. చివరికి దర్యాప్తు బాధ్యతను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ నెల 11, 12 తేదీల్లో తితిదే మాజీ ఈఓ ఏవీ ధర్మారెడ్డిని ఇదే కేసులో సిట్‌ అధికారులు విచారించారు. నాలుగు రోజులుగా వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్ననూ ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా వీరిద్దరితో పాటు ప్రొక్యూర్‌మెంట్‌ అధికారులు, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్, ఏఆర్‌ డెయిరీ ప్రతినిధులు చెప్పిన సమాధానాల ఆధారంగా అధికారులు ప్రశ్నావళి రూపొందించుకుని సుబ్బారెడ్డిని గురువారం విచారించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.