జగనన్నపై ద్వేషం లేదు.. ఆయనదీ తన రక్తమే; కానీ… వైఎస్ షర్మిల సంచలనం!!

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు నర్సీపట్నంలో పర్యటిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న వైఎస్ షర్మిల జగన్ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు.
నర్సీపట్నం రచ్చబండలో షర్మిల జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాను అన్నది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతుంది అన్నది వివరించి చెప్పారు.

తనకు జగనన్న అంటే ద్వేషం కాదని, ఆయన తన రక్తమేనని, తాను కేవలం చేసేది సిద్ధాంత పోరాటమేనని షర్మిల పేర్కొన్నారు. వైయస్సార్ ఆశయాలను జగనన్న నిలబెట్టడం లేదని, ఆయన విధానాలు, వైయస్సార్ ఆశయాలు కావని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి వైఎస్ కుటుంబంపై మమకారం ఉందని, వైయస్సార్ చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు చేర్చడం కాంగ్రెస్ కావాలని చేసిన తప్పు కాదని, పొరబాటున జరిగిందన్న విషయం సోనియాగాంధీ తనతో స్వయంగా చెప్పారన్నారు.

 

వైయస్సార్ అంటే సోనియాకు అభిమానమని తన మనసు నమ్మింది కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరాను అన్నారు. వైఎస్సార్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని, కాంగ్రెస్ వైఎస్ కుటుంబానికి, రాష్ట్రానికి మోసం చేయలేదని పేర్కొన్నారు. ఆనాడు వైఎస్ఆర్ జలయజ్ఞంతో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి అనుకున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో 54 ప్రాజెక్టులు కట్టారని, వైయస్సార్ చనిపోయే నాటికి 42 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులను జగనన్న పూర్తి చేస్తానని చెప్పాడని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా, ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ఎక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు అన్నారు. జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగని , వైయస్సార్ రైతు ఆశయాలను జగన్ తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల భూమిని కబ్జా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక కూలీ పనులకు పోతున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాక, పరిశ్రమలు లేక యువత ఇబ్బంది పడుతున్నారన్నారు. 25 మంది ఎంపీలు ఏపీలో ఉండి గాడిదలు కాస్తున్నారని, కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే ఒక రోజు కూడా ఆందోళన చేయలేదని, ఎంపీలు రాజీనామా చేసి ఉంటే హోదా వచ్చి ఉండేదని పేర్కొన్నారు. బిజెపి మీద దండయాత్ర చేయాల్సింది పోయి వంగి వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి ఒక కుంభకర్ణుడని, ఎన్నికలకు ముందు ఉద్యోగాలు అంటూ నిద్ర లేచాడని పేర్కొన్నారు. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని ఇప్పుడు 6 వేల పోస్టులు వేశారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవీ అమలు కాలేదని, విభజన హామీలు నెరవేరలేదని, ప్రత్యేక హోదా రాలేదని, రాజధాని నిర్మాణం కాలేదని షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

జగన్ వాగ్ధానాలు మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం కారణంగా జనాలు చనిపోతున్నారని, దేశంలోని 25 శాతం మరణాలు ఆంధ్రాలో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు, పరిశ్రమలను తెస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని వైయస్ షర్మిల పేర్కొన్నారు.