వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘కలలకు రెక్కలు’ పథకం అమలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థినులకు ఈ పథకం కింద సాయం అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో.. కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి-శిక్షణ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మార్గాలను సూచించేందుకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉమ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు రెసిడెన్షియల్‌ కళాశాలల్లో సౌకర్యాల మెరుగుకు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. అనుమతులు లేకుండా నడిచే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలి. ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీట్లు సాధించేలా చూడాలి’’ అని లోకేశ్‌ సూచించారు.


డిప్లొమా కోర్సుల పాఠ్యప్రణాళిక మార్పు

‘‘పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా 26 డిప్లొమా కోర్సుల పాఠ్యప్రణాళికలో మార్పులు చేస్తున్నాం. ఈ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గుజరాత్‌కు చెందిన నామ్‌టెక్‌ సంస్థ రాష్ట్రంలో మూడు హబ్‌లు, 13 స్పోక్స్‌లను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. 83 ఐటీఐలను భారీ పరిశ్రమలతో అనుసంధానిస్తున్నాం. పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన కింద 21,540 మందికి స్వల్పకాలిక శిక్షణ అందించడానికి కేంద్రం నుంచి అనుమతి లభించింది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, వర్సిటీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 485 ఉపాధి కల్పనా నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విద్యార్థులతో మాక్‌ అసెంబ్లీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి. డిసెంబరు 5న మెగా పీటీఎంను మరింత సమర్థంగా చేపట్టాలి’’ అని లోకేశ్‌ ఆదేశించారు. రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతించే అంశంపై అధికారులతో చర్చించారు. మంత్రి లోకేశ్‌ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వివిధ వర్సిటీల ప్రతినిధులతో జరిపిన చర్చల పురోగతిపైనా సమీక్షించారు. 50శాతం గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ విశాఖ నుంచే సిద్ధం కావాలన్నది సీఎం చంద్రబాబు మనోభీష్టమని చెప్పారు. ఉపాధ్యాయుల టెట్‌ అర్హత పరీక్షకు సంబంధించిన కేసు పురోగతిపై మంత్రి ఆరా తీశారు. విదేశీ విద్య పథకాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపైనా చర్చించారు.

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఉండవు

ఉపాధ్యాయులకు ఇకపై బోధనేతర బాధ్యతలు ఉండవని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపైనే దృష్టిపెట్టాలని మంత్రి లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం ఏపీటీఎఫ్‌ అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్‌తో మంత్రి భేటీ అయ్యారు. ‘‘గత 17నెలల్లో 424 సమస్యలను ఫ్యాప్టో ద్వారా నా దృష్టికి తెచ్చారు. ఇందులో 200 సమస్యలు పరిష్కరించాం. 81 పరిష్కార యోగ్యమైనవి కావు. 72 విజ్ఞాపనలు పాలసీ అంశాలకు సంబంధించినవి. 71 సమస్యలు.. కోర్టుల పరిధిలో ఉన్నాయి’’ అని లోకేశ్‌ వివరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.