హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో శుభకార్యాలను నిర్వహించుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు. అలాగే మరికొన్ని మౌడ్య రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని..
అలా చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 26 నుంచి శుక్ర మౌడ్యమి ఏర్పడనుంది. 2026 ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 83 రోజులపాటు శుక్ర మౌడ్యమి ఉండనుంది. అయితే మౌడ్యమి అంటే ఏమిటి? శుక్ర మౌడ్యమి ఉన్నన్ని రోజులు ఏం చేయొద్దు? ఏం చేయాలి?
మౌడ్యమి అంటే శూన్యం అని అర్థం. అంటే మూఢం అని కూడా అంటారు. అంటే మూఢం ఉన్న రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 లోపు గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి అతి సమీపంలో ఉంటున్నారు. దీంతో ఈ రెండు గ్రహాలు బలహీనంగా మారిపోతుంటాయి. సాధారణంగా శుభకార్యాలు నిర్వహించడానికి గురు బలం ఎక్కువగా ఉండాలి. అలాగే సంపద లేదా సంతోషంగా ఉండడానికి శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. ఈ రెండు గ్రహాల బలం తగ్గిపోవడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని అంటున్నారు. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, బోర్లు తవ్వించడం వంటివి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు అని చెబుతున్నారు. ఫిబ్రవరి 17 తర్వాత వివాహాలు జోరుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే యధావిధిగా జరిపే సీమంతం, నూతన వస్త్రాలంకరణ వంటి కార్యక్రమాలకు ఇవి వర్తించవు అని అంటున్నారు. ఆ కార్యక్రమాలను సమీప పండితులను సంప్రదించి నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ మూఢం రోజులు వచ్చాయి. మార్చి 13 నుంచి 25 వరకు మూఢం రోజులు రాగా.. ఈసారి 83 రోజులపాటు మూఢం రోజులు ఉండడంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారు వాయిదాలు వేసుకుంటున్నారు. అలాగే గృహప్రవేశాలు చేసుకునే వారు సైతం తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు.
అయితే ఈరోజుల్లో నిత్య పూజలు.. ఇతర కార్యక్రమాలు యధావిధిగా జరుపుకోవాలని అంటున్నారు. మౌడ్యం రోజులు కేవలం కొత్త కార్యక్రమాలు లేదా కొత్త పనులు చేయడానికి మాత్రమే వర్తిస్తాయని.. అలాంటి వాటికి మాత్రమే దూరంగా ఉండాలని.. నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు.. పండుగలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. అయితే ఈ రోజుల్లో ప్రత్యేకంగా దైవారాధన చేయడం వల్ల కొన్ని ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.



































