తమిళ సినిమా పరిశ్రమలో అగ్రగామి నటులలో అజిత్ కుమార్ ఒకరు. ప్రస్తుతం నటన, కార్ రేసింగ్‌తో బిజీగా ఉన్న ఆయన, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, కీర్తి, దాని పర్యవసానాలు మరియు కుటుంబం గురించి మాట్లాడిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తన సినీ ప్రయాణానికి, అది తనకు అందించిన కీర్తి మరియు గుర్తింపుకు తాను రుణపడి ఉంటానని, అయితే దానికి చాలా పెద్ద త్యాగం అవసరమని అజిత్ అన్నారు.
హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సినీ పరిశ్రమలో తన ప్రారంభ రోజుల్లో సరిగ్గా తమిళం కూడా మాట్లాడలేకపోయానని ఆయన తెలిపారు. “నా తమిళ ఉచ్ఛారణ భిన్నంగా ఉండేది. కానీ, తరువాత నేను దానిని సరిదిద్దుకున్నాను. మొదట్లో చాలా మంది నా పేరు మార్చుకోమని అడిగారు. ఎందుకంటే వారికి అది చాలా సాధారణ పేరుగా అనిపించింది. కానీ, నాకు వేరే పేరు వద్దని నేను చెప్పాను.”
“నేను చేసే ప్రతి పనిలో నా హృదయాన్ని, ఆత్మను పెడతాను. చాలా సవాళ్లు ఎదురయ్యాయి. నేను అన్నింటినీ అధిగమించాను. రేసింగ్‌లో కూడా అంతే. ఒక జీవిత ప్రయాణాన్ని సృష్టించాలనుకునే 19 ఏళ్ల యువకుడిలా నేను కష్టపడుతున్నాను. నేను పనిచేసే దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరినీ పొందడం నా అదృష్టం. నేను వారి నుండి చాలా నేర్చుకుంటాను.”
సినిమాల్లో పనిచేసేటప్పుడు జరిగిన ప్రమాదాలు మరియు ఇతర కారణాల వల్ల తాను 29 శస్త్రచికిత్సలకు (ఆపరేషన్లకు) గురైనట్లు అజిత్ వెల్లడించారు. తన అన్ని విజయాలకు ఆయన తన భార్య షాలినీకే రుణపడి ఉంటారు. “నేను సులభంగా కలిసిపోయే వ్యక్తిని కాదని అనుకుంటున్నాను. నేను ఆమెకు చాలా కష్టాలు ఇచ్చాను. కానీ ఆమె ఎంతో గొప్ప మద్దతు ఇచ్చింది. పిల్లలు పుట్టే వరకు ఆమె నా రేసుల కోసం నాతో ప్రయాణించేది.”
“ఆమె మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. నేను తరచుగా నా ఇంటికే పరిమితమైపోతాను. నాకు లభించే ప్రేమకు నేను అభిమానులకు రుణపడి ఉంటాను, కానీ ఆ ప్రేమ కారణంగా నేను కుటుంబంతో కలిసి బయటకు వెళ్లలేకపోతున్నాను. నా కొడుకును పాఠశాలకు తీసుకువెళ్లలేకపోయాను. దయచేసి వెనక్కి వెళ్ళమని వారు చాలా వినయంగా నన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.”
“సౌకర్యాలు మరియు మంచి జీవనశైలి విషయానికి వస్తే, కీర్తి మీకు చాలా ఇస్తుంది, కానీ మీకు చాలా ముఖ్యమైన విషయాలను అది మీ నుండి లాగేసుకుంటుంది,” అని అజిత్ విచారంతో అన్నారు.

































