ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై కసరత్తు కీలక దశకు చేరింది. కొత్త రెవిన్యూ డివిజన్ల.. అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు పైన ప్రతిపాదనలు దాదాపు ఖరారయ్యాయి.
ఇప్పటికే ఈ అంశం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయ సేకరణ చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు పైన వచ్చే కేబినెట్ భేటీలో నివేదిక ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత అధికారిక ప్రక్రియ పూర్తి చేసి కొత్త జిల్లాలు.. రెవిన్యూ డివిజన్లను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పైన సీఎం చంద్రబాబు కీలక భేటీ ఏర్పాటు చేసారు. ఇప్పటికే పలు ప్రతిపాదనల పైన కసరత్తు చేస్తున్న మంత్రివర్గ ఉప సంఘంతో చంద్రబాబు సమావేశం కాను న్నారు. వరుసగా సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ముఖ్యంగా మార్కాపురం, మదనపల్లిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక, పరిపాలనా అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతోంది. ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు, పరిపాలన సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరప నున్నారు. ఈ భేటీ అనంతరం ఈ నెల 28వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేస్తోంది
పలు రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు పైన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకే జిల్లాలో ఉండే విధంగా సర్దుబాటు పైన చర్చలు జరిగాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఈ ప్రక్రియకు తుది రూపు ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు మార్కాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లా పరిధిలో మార్కాపురం, దర్శి, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి. అన్నమయ్య జిల్లాలో మదనపల్లెకు పుంగనూరు, పిలేరు, తంబల్లపల్లె మండలాలు చేర్చాలని ప్రతిపాదన ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో రంపచోడవరం, చింతూరు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. పోలవరం ముంపు ప్రాంతాలన్నింటితో ఓ జిల్లా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే హామీ ఇవ్వటంతో.. ఈ ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది.
ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలని, హెడ్‌క్వార్టర్లకు వంద కిలోమీటర్లకు పైగా దూరం లేకుండా చూడాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రి వర్గ ఉపసంఘానికి సూచన చేసారు. అందులో బాగంగా నూజివీడును ఏలూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి.. కైకలూరును కృష్ణా జిల్లాలో కలపడం, గూడూరును నెల్లూరుకు మార్చచడం, పెనమలూరు, గన్నవరాన్ని కృష్ణా నుంచి ఎన్‌టీఆర్‌కి మార్చడం, పెనమలూరును మచిలీపట్నంలో కలపడం వంటి వాటిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేర్ల మార్పు పైనా కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరులోగా ఈ కసరత్తు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశం కీలకంగా మారుతోంది.
































