గాజాలో హమాస్, లెబనానన్ లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ మరోసారి కొరడా ఝుళిపించింది. లెబనాన్ పై భీకర దాడులు చేపట్టింది.
ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. రాజధాని బీరుట్ పై ఈ వైమానిక దాడులు కొనసాగాయి. హిజ్బుల్లా టాప్ కమాండర్, ఆర్గనైజేషన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హేథమ్ అలీ తబ్తబాయి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది.
ఆదివారం రాత్రి ఈ దాడులు జరిగాయి. బీరూట్ దక్షిణ ప్రాంతంలోని హరెత్ హ్రీక్ లో అలీ తబ్తబాయి నివసిస్తోన్న అపార్ట్మెంట్ ను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయెల్. ఈ దాడిలో అయిదుమంది మరణించారు. 28 మంది గాయపడ్డారు. మృతుల్లో అలీ ఉన్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులను తిరిగి సమీకరించకుండా నిరోధించడానికే ఈ తాజాగా దాడులు చోటు చేసుకున్నాయి. వీటిని అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.
మృతుల వివరాలను లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బీరుట్ దక్షిణ ప్రాంతంపై హిజ్బుల్లాకు గట్టి పట్టు ఉంది. గత ఏడాది ఇదే నవంబర్ లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడం ఇది అయిదోసారి. ఈ ఘటనపై హిజ్బుల్లా స్పందించింది. ఓ సీనియర్ కమాండర్ లక్ష్యంగా ఈ దాడి చోటు చేసుకున్నట్లు నిర్ధారించింది. అలీ తబ్తబాయి మరణించినట్లు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
ఇజ్రాయెల్ చర్యలను హిజ్బుల్లా అధికార ప్రతినిధి మహమూద్ తప్పుపట్టారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ దాడిలో ఓ కీలక నాయకుడిని కోల్పోయామని స్పష్టం చేశారు గానీ ఆయన ఎవరనేది వెల్లడించలేదు. ఈ దాడితో ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటిందని, దీనికి ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు.
మొత్తం తొమ్మిది అంతస్తుల అపార్ట్ మెంట్ అది. మూడు, నాలుగో అంతస్తులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఘటన స్థలం మొత్తం ధ్వంసమైంది. తొలుత పేలుళ్ల శబ్దం వినిపించింది. ఆ వెంటనే అపార్టమెంట్ లో మంటలు చెలరేగాయి. అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, లెబనాన్ సైనికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించారు. రోడ్లపై శిథిలాలు, కాలిపోయిన కార్లు కనిపించాయి.
1980లో హేథమ్ అలీ తబత్బై హిజ్బుల్లాలో చేరాడు. అనేక కీలక సైనిక పదవులను నిర్వహించాడు. ఎలైట్ రద్వాన్ ఫోర్స్ కమాండ్, సిరియాలో హిజ్బుల్లా యూనిట్ల పర్యవేక్షణ, గ్రూప్ బోర్డర్ ఆపరేషన్లకు సంబంధించిన కార్యకలాపాల్లో కీలక పాత్రలు పోషించాడు. 2024 ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధానికి అలీ సారథ్యాన్ని వహించాడు.






























