నయా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. T20 ప్రపంచ కప్‌లో సరి కొత్త ప్రయాణం

 టీ20 ఫార్మాట్‌లోకి రోహిత్ శర్మ సరికొత్త పాత్రలో తిరిగి వచ్చాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన ఈ స్టార్ క్రికెటర్ ఇదే ఫార్మాట్‌లో తన ప్రయాణాన్ని కొత్త పాత్రలో నిర్వహించడానికి ఎంపిక అయ్యాడు.


ఇంతకీ రోహిత్ శర్మ కొత్త పాత్ర ఏంటో తెలుసా.. 2026 టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. 2026 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించే ముందు, రోహిత్ శర్మ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని ఐసీసీ ఛైర్మన్ జే షా ప్రకటించారు. 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే.

నయా చరిత్ర సృష్టించిన రోహిత్ ..
2026 T20 ప్రపంచ కప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ నియామకం సరికొత్త చరిత్రకు నాంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూనే ఈ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మొదటి వ్యక్తిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ టెస్ట్, T20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు, కానీ ఈ స్టార్ క్రికెటర్ ODI ఫార్మాట్‌లో తన క్రికెట్ జర్నీని కొనసాగిస్తున్నాడు.

T20 ప్రపంచ కప్‌లో రోహిత్ చరిత్ర గురించి చెప్పాలంటే.. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణించాడు. రోహిత్ 2007, 2024లో రెండుసార్లు భారతదేశం ట్రోఫీ ముద్దాడిన జట్టులో భాగం అయ్యాడు. ఒక సారి ఆటగాడిగా, మరొక సారి సారథిగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ 44 ఇన్నింగ్స్‌లలో 1220 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఈ స్టార్ క్రికెటర్ 12 హాఫ్ సెంచరీలు చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో 2024 T20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకుంది.

రోహిత్ స్పందన ఏంటి..
2026 T20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవం అని అన్నారు. “ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎవరినీ అంబాసిడర్‌గా నియమించలేదు. గతంలో మాదిరిగానే మ్యాజిక్‌ను సృష్టించాలని ఆశిస్తున్నాను. ICC ట్రోఫీని గెలవడం చాలా పెద్ద సవాలు. నేను దానిని స్వయంగా అనుభవించాను. నేను క్రికెట్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. నా కెరీర్ ప్రారంభంలో రెండు ICC ట్రోఫీలను గెలుచుకున్నాను, ఈ మధ్య సంవత్సరాల్లో ICC ట్రోఫీని గెలవడానికి మేము ఎంతగా తహతహలాడామో నాకు గుర్తుంది” అని అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.