కళ్లు. మనకు ప్రపంచాన్ని చూపించేవి. మన శరీరంలోని సున్నితమైన అవయవాల్లో కీలకమైనది. కంటి పైన ప్రత్యక్షంగా.. పరోక్షంగా అనేక శారీరక లక్షణాలు ప్రభావితం చూపుతాయి.
కంటి పరీక్ష ద్వారా కొన్ని సమస్యల లక్షణాలను గుర్తించ వచ్చు. మధుమేహం, లివర్ వంటి సమస్యలు సైతం కంటిని ప్రభావితం చేస్తాయి. అయితే, కంప్యూటర్లు.. స్క్రీనింగ్ కు అలవాటు పడిన వారికి కంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కాంటాక్టు లెన్సులు, కళ్లద్దాలు అలవాటుగా మరిపోయాయి. మరి.. రోజంతా కళ్లదాలతో ఉంటే ఏం జరుగుతుంది.. ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.
కంటి ఆరోగ్యం చాలా అవసరం. ఏ చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా చూపు దెబ్బ తింటుంది. కంటి విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తక్కువ వెలుతురులో చదివితే చూపు తగ్గిపోతుందని చాలా మంది అనుకుంటుంటారు. ఇది వాస్తవం కాదు. మసక వెలుతురులో చదవడం వల్ల కళ్లు అలసిపోయినట్లు అనిపించవచ్చు, కానీ అది హానికరం కాదు. పుస్తకం మీద నేరుగా వెలుతురు పడేలా లైటును అమర్చుకొని చదువుకోవడం మంచిందని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన కంటి చూపును నిర్వహించడానికి శరీరానికి విటమిన్ ఎ చాలా అవసరం. క్యారెట్లలో ఈ పోషకం అధిక మొత్తంలో ఉంటుంది. ఆకుకూరలు, ముదురు రంగు కూరగాయలు, పాలు, చేపలు వంటి అనేక వనరుల ద్వారా పొందవచ్చు. కాంటాక్ట్ లెన్సులు లేదా కళ్లద్దాలను రోజంతా పెట్టుకోవటం మంచిది కాదని, దీంతో కళ్లు వాటికి అలవాటు పడిపోతాయనేది మరికొందరి అపోహ. ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు.
ఇక..హ్రస్వదృష్టి , దూరదృష్టి , ఆస్టిగ్మాటిజం లేదా ప్రెస్బియోపియాను సరిచేయడానికి ధరించే కళ్లద్దాలు కళ్లను బలహీనపరచవని ప్రముఖ అధ్యయనం పేర్కొంది. మామూలుగా వయసు మీద పడటం, జబ్బుల మూలంగానో కంటి అద్దాల పవర్ మారుతుంటుంది. కంటి సమస్య ఉంటే నిర్దిష్ట కాలంలో పరీక్షలు తప్పనిసరి. తప్ప కళ్లద్దాలు, లెన్సులతో చూపు తగ్గటం, కళ్లు దెబ్బతినటం వంటి ముప్పులేవీ ఉండవని పేర్కొంటున్నారు. సరైన కళ్లద్దాలు ధరించడం వల్ల కూడా కంటి ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించారు. అదే పనిగా కంప్యూటర్ వైపు చూడటం కళ్లకు ప్రమాదకరమని ఇంకొందరు భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదని, స్క్రీన్ వైపు గంటలకొద్దీ చూడటం వల్ల కళ్లు అలసిపోవటం, ఒత్తిడికి లోనవటం సహజమే గానీ చూపేమీ దెబ్బతినదని నిపుణులు అంటున్నారు. అయితే, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలోని దృశ్యాలను చూడటం అలవాటు చేసుకోవాలి. అయితే, చూపు మసకబారటం, కంటి నొప్పి, మిరుమిట్లు గొలిపే కాంతులు మెరవటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
































