2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు డిలీట్..UIDAI షాకింగ్ నిర్ణయం

ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మోసాలను అరికట్టడానికి, ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ‘క్లీన్-అప్'(Aadhaar clean-up) కార్యక్రమాన్ని చేపట్టింది.


ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మరణించిన వ్యక్తులకు చెందిన 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను(aadhar-number) డియాక్టివేట్ చేస్తున్నట్లు UIDAI ప్రకటించింది. చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లు యాక్టివ్గా ఉండటం వల్ల, వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ నంబర్లను ఉపయోగించి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలను మోసపూరితంగా క్లెయిమ్ చేయకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నారు.

మరణించిన వ్యక్తుల వివరాలను UIDAI అనేక మార్గాల ద్వారా సేకరించింది. ఇందులో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం, అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వంటి ఇతర ప్రభుత్వ పథకాల నుంచి అందిన వివరాలు ఉన్నాయి. సేకరించిన రికార్డులను క్షుణ్ణంగా ధృవీకరించిన తరువాత, 2 కోట్ల కంటే ఎక్కువ ఆధార్ నంబర్లను నిలిపివేశారు.

UIDAI అధికారుల ప్రకారం, ఆధార్ నంబర్ను ఒకసారి జారీ చేస్తే, దానిని మరొకరికి కేటాయించే అవకాశం లేదు. అయితే, మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే దానిని డిలీట్ చేయడం చాలా అవసరం. మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్ను కుటుంబ సభ్యులు సులభంగా తెలియజేసేందుకు UIDAI ఈ ఏడాది ప్రారంభంలో ‘myAadhaar’ పోర్టల్లో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ తో అనుసంధానమైన 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సేవ అందుబాటులో ఉంది. కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, డెత్ సర్టిఫికేట్ వివరాలను సమర్పించవచ్చు. UIDAI ఇప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుండి కూడా మరణించిన వారి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్లీన్-అప్ డ్రైవ్, ప్రభుత్వ నిధులను కాపాడటంలో, డిజిటల్ గుర్తింపు వ్యవస్థ విశ్వసనీయతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.