విష్ణు పురాణం ప్రకారం.. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీమహా విష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.
అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో, భజనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వల్ల మోక్షం పొందవచ్చు అని శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి 2025 డిసెంబర్ తేదీలు, విశిష్టత, తిథి ప్రారంభం వంటి విషయాలు తెలుసుకుందాం..
శేషతల్పంపై శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి వారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi). పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి.. పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు దర్శనం తర్వాత స్వామి వారికి పూజచేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.వైకుంఠ ఏకాదశి 2025 తిథి
తెలుగు పంచాంగం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి తిథి (Vaikunta Ekadasi Tithi December 30) 2025 డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 07:51 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 05:01 గంటలకు ముగుస్తుంది (Vaikunta Ekadasi Tithi End December 31). సూర్యోదయం తిథిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి 2025 పండుగను మంగళవారం డిసెంబర్ 30వ తేదీ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుఝామునే 3:30 గంటల నుంచే వైష్ణవ ఆలయంలో ద్వార దర్శనం ప్రారంభమవుతుంది.
ముక్కోటి ఏకాదశి రోజు మూడు విశేషాలు
ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి తిథులతో సరిసమానమైన పవిత్రతను కలిగియున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా కొందరు చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజే పాలకడలి నుంచి అమృతం పుట్టిందని కూడా అంటారు. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించారని కూడా భక్తుల విశ్వాసం.
వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరిస్తే మరో జన్మంటూ ఉండదట!
ముక్కోటి ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో నియమ నిష్ఠలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని అంతే కాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే విష్ణుపూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణ మరియు పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయట. ఇవన్నీ చేయకలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు, వేంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి. ఈరోజున ఆచరించే ముఖ్యమైన ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం శుభ ఫలితాలను కలగజేస్తాయి.
వైకుంఠ ఏకాదశి 2025 తిరుమల
తిరుమల శ్రీవేంకటేశ్వర (Tirumala Venkateswara temple) స్వామి వారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార ప్రవేశం, తదనంతరం దైవదర్శనానికి అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. తర్వాత తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి రోజు సుప్రభాతం మొదలుకొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు.
10 రోజుల పాటు దర్శన భాగ్యం
శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నారు. డిసెంబర్ 30, 31, 2026 జనవరి 1వ తేదీ దర్శనాలకు నవంబర్ 27 (గురువారం) నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో భక్తులు ముందస్తుగా రిజిస్టర్ చేసుకుంటే డిప్ ద్వారా ఉచిత సర్వ దర్శన టోకెన్లు కేటాయించనున్నారు. అనంతరం జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా నేరుగా సర్వ దర్శనం అమలు చేయనున్నారు.
శ్రీరంగంలో కూడా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం (Sri Ranganathaswamy Temple Srirangam) లో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని.. రెండో భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువు అవతారమైన రంగనాథస్వామి వారిని వైకుంఠ ఏకాదశి రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి.. వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకొచ్చి అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు నేరుగా వైకుంఠం చేరుకుంటారని నమ్మకం.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.



































