దేశ పౌరులకు కీలక ఆధారం అయిన ఆధార్‌కార్డుల్లో మార్పులు చేర్పుల అప్‌డేట్ ఇక సులభతరం కానుంది.
ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా అత్యంత సరళమైన పద్ధతుల ద్వారా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు వీలేర్పడింది. ఈ మేరకు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియల సాధికారిక సంస్థ ఉడాయ్ శుక్రవారం అధికారిక ప్రకటన వెలువరించింది. ఇంతకు ముందటి లాగా ఇందుకోసం ఈ సేవా కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేదు, రోజులు నెలల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్లను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా సరిచేసుకోవచ్చు. డిజిటల్ సిస్టమ్ ద్వారా ఎవరైనా ఈ దిద్దుబాటకు దిగవచ్చు. ఇందుకు వ్యక్తిగతంగా ఎవరూ కూడా సేవా కేంద్రాలను వెతుక్కుంటూ వెళ్లి క్యూల్లో పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. సంబంధిత పత్రాలు, నిర్థారణల వంటి జంజాటం కూడా అవసరం లేకుండా చేశారు. ఆధార్ కార్డుల్లో ఉండే విశిష్ట ప్రాధికారిక సంఖ్య వ్యక్తుల గుర్తింపు నెంబరుగా ఉంటోంది.
ఈ క్రమంలో మన ఆధార్‌కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాల లబ్థికి, పాన్‌కార్డులు ఇతరత్రా గుర్తింపు కార్డులు పొందడానికి ఇది ప్రధానమైన అంశంగా ఉంటోంది. పౌరుల పలు రకాల సేవల వాడకం బిల్లులు ఎలక్ట్రిసిటీ లేదా వాటర్ బిల్లుల ప్రతులను సరైన చిరునామాల గుర్తింపుగా కూడా ఆమోదిస్తారు. సొంతంగా లేదా తగు విషయ పరిజ్ఞానం ఉన్న వారి ద్వారా ఆధార్ అప్‌డేట్‌కు వెళ్లవచ్చు. ఇందుకు చేయాల్సింది.
* ఆధార్ అధికారిక పోర్టల్‌లోకి ఎంటర్ కావడం
* మన స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా ముఖ గుర్తింపు నిర్థారణ
*మన రిజిస్టర్డ్ మొబైల్ కు ముందుగా ఆధార్ నెంబరను పంపించడం, తరువాత మనకు వచ్చే ఒటిపిని పొందుపర్చడం
* అప్‌డేట్ ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకోవడం, సెలెక్ట్ చేసుకుని మనం మార్చాలనుకునే సమాచారం మార్చుకోవచ్చు
* ఈ క్రమంలో అవసరం అయిన సమాచార డాక్యుమెంట్లను జతచేయడం
* మన అభ్యర్థనను పొందుపర్చడం తరువాత దీని ప్రోగ్రెస్ గురించి ఆన్‌లైన్ ద్వారా నిర్థారించుకోవడం, ఒక్కసారి వెరిఫై తరువాత మార్పులు చేర్పులు మన ఆధార్ పూర్వాపరాలలో వాటంతట అవే కన్పించడం జరుగుతుంది. ఇది ఆధార్ అప్‌డేట్‌గా నిర్థారించుకోవచ్చు.
2026 జూన్ 14 వరకూ ఈ ప్రక్రియ ఉచితం
ఆధార్ అప్‌డేట్ సరళీకృత విధానం గురించి ఉడాయ్ మరో కీలక విషయం వెల్లడించింది. దీని మేరకు వచ్చే ఏడాది జూన్ 14వ తేదీ వరకూ ఈ అప్‌డేట్‌ను ఎటువంటి చెల్లింపుల అవసరం లేకుండా ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అప్పటిలోగా పౌరులు తమ ఆధార్‌కార్డుల్లో అవసరం అయిన సవరణలను ఉచితంగానే చేసుకోవచ్చు. అయితే మన రిజిస్టర్డ్ , మనం వాడే మొబైల్ నెంబర్ అప్పటికే ఆధార్‌కు అనుసంధానం అయ్యి ఉండాలి.

































