స్పేస్‌ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి టాలెంటెడ్ వ్యక్తులను ఉద్యోగాల్లో నియమించుకుని అమెరికా చాలా లాభపడిందని అన్నారు.
ఏళ్లనాటి నుంచి ఇలా ప్రతిభావంతులైన భారతీయ ఉద్యోగులకు అవకాశం ఇస్తూ అమెరికా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘పీపుల్ బై WTF’ పాడ్ క్యాస్ట్ లో మస్క్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ అమెరికాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు కొన్ని సంవత్సరాలుగా భారత్ నుంచి టాలెంటెడ్ వ్యక్తులు వస్తున్నారని.. అలా అగ్రరాజ్యం ఇక్కడ వారికి ఉద్యోగాలు కల్పిస్తూ అమెరికా గణనీయంగా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ప్రతిభావంతులైన భారతీయ ఉద్యోగుల కారణంగా అమెరికాకు భారీగానే ప్రయోజనం చేకూరిందని అన్నారు. అయితే.. వలస విధానాలపై అమెరికాలో వ్యతిరేకత పెరగడానికి గతంలో H-1B వీసా కార్యక్రమం దుర్వినియోగం.. అలాగే గత ప్రభుత్వాల ఉదార వైఖరే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల భారతీయులకు అమెరికాలో ఉద్యోగం అందని ద్రాక్షగానే మారిందని స్పష్టం చేశారు. అమెరికా వీసా నిబంధనల్లో ప్రస్తుతం ఊహించని ఈ మార్పుల కారణంగా వేలాది మంది భారతీయులకు “అమెరికన్ డ్రీమ్” (ఉన్నత విద్య, అధిక వేతనంతో ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు) నెరవేరడం కష్టంగా మారిందని వివరించారు. ప్రస్తుతం మస్క్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ లాంటి వారు అమెరికా ఆర్థిక ప్రగతికి ఎలా దోహదపడ్డారో జెరోధా సహ-వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తెలిపారు. ఇక యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) వార్షిక రిపోర్టు ప్రకారం.. 2024లో అమెరికాలోని విదేశీ విద్యార్థులలో 27 శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. ఇది అంతకు ముందు సంవత్సం కంటే 11.8 శాతం ఎక్కువ. అయితే.. ప్రస్తుతం ఈ లెక్క మారుతోందని కామత్ అంచనా వేశారు. H-1B వీసా నిబంధనలను ఇటీవల ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసిన విషయాన్ని కామత్ ప్రస్తావించారు. ఈ కారణంగానే భారత్ నుంచి అమెరికాకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.
































