ఏపీ సర్కార్ కు ఉద్యోగుల కీలక డిమాండ్స్..! సీఎం హామీల అమలుకు పట్టు

పీలో ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్ధిక ప్రయోజనాలతో పాటు వివిధ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ కీలక డిమాండ్లను ప్రకటించారు.


ఈ మేరకు విజయవాడలో సమావేశమైన ఏపీ జేఏసీ అమరావతి నేతలు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తో భేటీ అయి తమ సమస్యల్ని వివరించారు. ముఖ్యంగా సీఎం గతంలో ఇచ్చిన హామీల మేరకు ఆయా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్థికమంత్రితో భేటీలో తమకు రావాల్సిన వేల కోట్ల బకాయిల వివరాల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని ఏపీ జేఏసీ అమరావతి కోరింది.

ప్రభుత్వం నుండి ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిల్లో ఏ ఉద్యోగికి ఏ పద్దు కింద ఎంత రావాలో ఆయా ఉద్యోగి

పే స్లిప్ లో స్పష్టత ఇవ్వాలని తద్వారా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలపై పారదర్శకత పాటించాలని కోరింది. ప్రధానంగా డి.ఏ, పి.ఆర్.సి, సరెండర్ లీవ్, ఎర్నెడ్ లీవ్, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర బకాయిలను ఏ ఉద్యోగికి ఎంత రావాలో ఆర్థిక శాఖ స్పష్టంగా బహిర్గతం చేయకపోవడం ఉద్యోగుల్లో అనుమానాలను కలిగిస్తోందన్నారు. కాబట్టి ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్‌కు రావలసిన బకాయిల్ని వారి పే స్లిప్‌లో స్పష్టంగా చూపేలా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపొందించాలని కోరారు.

అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్లెయిమ్ చేసుకునే బిల్లుల్లో ప్రధానంగా చనిపోయిన ఉద్యోగుల బెనిఫిట్స్, రిటైర్ అయిన ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, అత్యవసర వైద్య ఖర్చులు, మెడికల్ రీయింబర్స్మెంట్, పిల్లల వివాహం వంటి అత్యవసర అవసరాలుగా ఉన్న ఈ క్లెయిమ్‌లను ప్రాధాన్యత క్రమంలో వెంటనే క్లియర్ చేయాలని కోరారు. తద్వారా అర్ధాంతరంగా చనిపోయిన, రిటైర్, అనారోగ్యం పాలైన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

దీంతో పాటు ఇటీవల ఉద్యోగ సంఘాల తో జరిగిన సమావేశంలో 24 గంటలు, బందోబస్త్ డ్యూటీలతో రోజుల తరబడి వివిధ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవులు చెల్లించాలని కోరగా సీఎం అంగీకరించారు. ఈ మేరకు నవంబర్ నెలాఖరుకు సగం సరెండర్ లీవ్ , జనవరి నెలాఖరుకు మిగిలిన సగం సరెండర్ లీవ్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని నిలబెటట్టుకుంటూ పోలీసు సిబ్బందికి సగం సరెండర్ లీవ్ బిల్లులు ఇవాళ, రేపట్లో చెల్లించాలని కోరారు.

అలాగే మహిళా ఉద్యోగినులు వారి వారి బిడ్డల వయస్సుతో సంబంధం లేకుండా, పదవీ విరమణ వరకు ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునేలా ఆదేశాలు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. ఇంకా అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఆర్ధికమంత్రి తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.