ఓవైపు నల్లమల అడవుల అందాలు.. మరోవైపు కృష్ణమ్మ పరవళ్లు.. చుట్టూ ఎటుచూసిన పచ్చని ఎత్తైన కొండల మధ్య పడవ ప్రయాణం అంటే వావ్ అనాల్సిందే.. పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ క్రూజ్ షిప్ జర్నీ చేయాలని ఉందా..?
ఏకంగా ఆరు గంటలపాటు కృష్ణానదిలో పడవ ప్రయాణం మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. చుట్టూ పచ్చని కొండలు, నల్లమల అటవీ ప్రాంతంలో పడవలో ప్రయాణిస్తూ ఉంటే ఆ కిక్కే వేరు.. పరవళ్లు తొక్కే కృష్ణా నదిపై నాగర్జున సాగర్ నుంచి శ్రీశైలం మధ్య సాగే లాంచీ సర్వీసు గురించి ఎంత చెప్పినా తక్కువే..
నాగార్జున సాగర్ జలాశయం నుండి శ్రీ శైలం కు లాంచీ ప్రయాణం ఎట్టకేలకు నవంబర్ 29 శనివారం నుంచి ప్రారంభం అయింది. నాగార్జున సాగర్ నుండి లాంచీ ప్రయాణంను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ జీ ఎం మాన్వి లాంచీ స్టేషన్ మేనేజర్ హరితో కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఇక నుండి ప్రతి శనివారం లాంచీ ప్రయాణం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రానికి శ్రీ శైలంకు చేరుకుని ఆదివారం ఉదయం మళ్లీ అక్కడనుండి బయలుదేరి సాయంత్రానికి నాగార్జున సాగర్ కు చేరనుంది. త్వరలో లాంచీ ప్రయాణంలో వచ్చిన ప్రయాణికులకు శ్రీ శైలంలో రూమ్ ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
సాగర్ నుంచి శ్రీశైలం నదీ ప్రయాణం సుమారు 120 కి. మీ. ఉంటుంది. 6 గంటలపాటు జర్నీ సాగుతుంది. ఉదయం 9 గంటలకు డబుల్ డెక్కర్ క్రూయిజ్ షిప్ లో సోమశిల నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సోమశిల, అమరగిరి, అంకాలమ్మ కోట, చీమలదిబ్బ, లింగమయ్య పెంట, వేముల పాయ, గజ్జల కొండ, శివుని గడ్డ, నీటి గంగ, ఆముదాల పెంట, కదలివనం, అక్క మహాదేవి గుహలు, ఈగల పెంట దాటుకుంటూ సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. దారిపొడవునా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను టూరిస్టులను కనువిందు చేస్తున్నాయి. అలా శ్రీశైలంలోని దర్శనీయ ప్రదేశాలను చూపించిన తర్వాత తిరిగి రాత్రి 10 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటుంది. వీకెండ్ లో అధిక సంఖ్యలో టూరిస్టులు ఈ ప్రాంతాలను సందర్శిస్తుంటారు.
ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. ఈ లాంచీ ప్రయాణానికి టికెట్ ధరలు పెద్దలకు రూ.3,050, అలాగే పిల్లలకు రూ.2,450గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూరిస్ట్ ప్యాకేజీని కూడా అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ టూరిజం డిపార్ట్ మెంట్.

































